తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచేందుకు పిఎం జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పెద్దముల్ మండలం చైతన్య నగర్ లో పీఎం జన్మాన్ కింద పొందాల్సిన సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గిరిజన కుటుంబం తమకు కావలసిన మౌలిక సదుపాయాలను పీఎం జన్మాన్ ద్వారా పొందాలన్నారు. ప్రధానమంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ అభియాన్ ( పీఎం జన్మాన్ ) ద్వారా 11 రకాల ముఖ్యమైన సౌకర్యాలను పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 22 ఆవాసాలలో 776 కుటుంబాలకు ఈ పథకం ద్వారా సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా వ్యక్తిగత సౌకర్యాలు పొందేందుకు వీలుగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. పీఎం జన్మాన్ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సౌకర్యాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో ఇప్పటికీ విద్యుత్తు కనెక్షన్, మంచినీటి కనెక్షన్, పంట రుణాలు పొందని వారి జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి విద్యుత్తు కనెక్షన్ అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందేలా ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ అధికారికి కలెక్టర్ తెలిపారు. 2005 డిసెంబర్ కంటే ముందు పోడు భూములు సాగు చేసుకున్న వారి జాబితాలను సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి గ్రామాల్లోకి వెళ్లి ఆధార్ ప్రక్రియను చేపట్టాలని తాసిల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని డిఎంహెచ్ఓ కు కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యార్థం కనెక్షన్ ఇవ్వాలని అదేవిధంగా ఎక్కడైనా మరమ్మతులు ఉంటే గ్రామపంచాయతీ పన్ను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో చైతన్య నగర్ సర్పంచ్ పి. లలిత, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ డిఈఓ రేణుకా దేవి, డి డబ్ల్యు ఓ లలిత కుమారి, డిఎంహెచ్వో పల్వన్ కుమార్, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్ లతో పాటు వివిధ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీఎం జన్మాన్ పథకంతో గిరిజన తెగల జీవితాల్లో మార్పు





