వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. ఆకాశంలో మేఘాలలో మెరుపులు ఏర్పడతాయి. కాని వీటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయి. ఇలా భూమిని తాకిన మెరుపులే పిడుగుకు కారణమవుతాయి. నీలి రంగు మెరుపులు చాలా ప్రమాదం.
పిడుగు ఎలా ఏర్పడుతుంది:
ఇరవైఐదు వేల అడుగుల ఎత్తున ఉన్న మేఘాలకు పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకినపుడు తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందకి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం ఎక్కువైనప్పుడు ధనావేశం కొరకు గాలి ద్వారా భూమి వైపు రునావేశ మేఘాలు aaవచ్చే క్రమంలో శక్తి వంతమైన విద్యుత్ఘాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అని పిలుస్తారు.
క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువ పిడుగులను కల్గిస్తాయి. పిడుగు దాదాపు ముప్పై కోట్ల ఓల్టుల విద్యుత్ ను కలిగి ఉంటుంది. ఇంటికి వాడే విద్యుత్ కేవలం 230 ఓల్టులతో పోలిస్తే ఇది ఎంత ప్రమాదకరమో ఊహించవచ్చు. కొండప్రాంతాలలో రాత్రి మరియు తెల్లవారు ఝామున, మైదానాలలో పగటి పూట, ఎండాకాలంలో సముద్రతీర ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా పిడుగులు పడతాయని అమెరికాకి చెందిన నాసా తెలిపింది.
అపార నష్టం కలుగుతుంది:
పిడుగులు మనుషుల, పశువుల మరణంతో పాటు ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి. ఎత్తుగా ఉండే చెట్లు, టవర్లు, నీరు అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పడతాయి. యేటా ప్రపంచంలో సుమారు ఇరవై ఐదు వేల మంది పిడుగు పాటుకు బలవుతున్నారు. ఇక మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన మొత్తం 8060 మరణాలలో పిడుగుల కారణంగానే 35.8 శాతం అంటే 2887 మంది చనిపోయారని నివేదించింది. దేశవ్యాప్తంగా వీటి వల్ల యేటా 2000 మంది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం మరణాల రేటు సంవత్సరానికి ఒక కోటికి 25 మంది అని తెలిపింది.
లైట్నింగ్ రెసిలెంట్ ఇండియా క్యాంపెయిన్ 2023 నివేదిక ప్రకారం వీటి సంఖ్య 2019 సం. నుండి 2023సం. మధ్యలో 53 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 300 శాతం పెరిగాయని తెలిపింది. మహారాష్ట్రలో పిడుగుల మరణాలలో పెరుగుదల కనిపించింది. పిడుగులు పడడంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో, తరువాత రెండు, మూడు స్థానాలలో ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలు ఉన్నాయి. పిడుగు పాటు చావులలో 66 శాతం పురుషులు , 34 శాతం స్త్రీలు ఉన్నారు. వీరిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల శాతం వరుసగా నాలుగు మరియు తొంభై ఆరు శాతంగా ఉంది. మన దేశంలో వర్షాకాలంలో 47.2 % , వేసవి కాలంలో 41.5 %, తరువాత కాలంలో 7.7 % పిడుగులు ఏర్పడుతున్నాయి.
పిడుగుపాటుకు ఎక్కువ బలయ్యేవారు:
రైతులు, వ్యవసాయ కూలీలు, వారితో తోడుగా వెళ్ళే పిల్లలు, ఆరుబయట పనిచేసే వారు, నీటి గొట్టాలు బిగించే వారు, విద్యుత్ టవర్ల వద్ద పనిచేసేవారు, వాహన దారులు, పాదాచారులు ఎక్కువగా గురవుతున్నారు. పిడుగుకి గురైన పది మందిలో తొమ్మిది మంది బ్రతికి బయట పడుతున్నారు. కాని వీరిలో జ్ఞాపకశక్తి లోపించడం, తలతిరగడం, తిమ్మిర్లు వంటి లక్షణాలు జీవితాంతం ఉంటాయి. పిడుగు శబ్ధం మెదడులోని న్యూరాన్లును బలహీన పరిచి శాశ్వత చెవుడును కల్గిస్తుంది. దీని అధికకాంతికి అంధత్వం రావచ్చు.
పిడుగుకు కారణాలు:
పిడుగులు ఎక్కువగా పడడానికి కారణం కాలుష్యం, భూతాపం, అటవీ నిర్మూలన, పర్యావరణ క్షీణత మరియు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం లాంటివని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రతలో ప్రతీ డిగ్రీ పెరుగుదలకు పన్నెండు శాతం అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు నివేదించారు.
పిడుగు లేని మెరుపులు మంచివే:
మెరుపు నుండి వచ్చే వేడివలన గాలిలోని నైట్రోజన్ ఆక్సిజన్‌తో కలసి నైట్రేట్లు, ఇతర సమ్మేళనాలు ఏర్పడి ఇవి వర్షంలో కరిగి భూమిలోకి చేరి మొక్కలు పెరగడానికి సహాయపడతాయు.
ముందు జాగ్రత్తలు:
కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ మార్గదర్శకాల ప్రకారం మెరుపులు వస్తున్నప్పుడు బయటకు వెళ్ళగూడదు. పొలాల్లో ఉన్న వారు దగ్గరలో ఉన్న భవనానికి చేరుకోవాలి. చెరువులు, నదులుకు దూరంగా ఉండాలి. చెట్లు కింద ఉండరాదు. కొండలు మీద ఉంటే త్వరగా దిగువకు వచ్చేయాలి. ఎత్తైన టవర్లు, విద్యుత్ స్తంభాలుకు దూరంగా ఉండాలి. నదులు, చెరువులలో ఈతకొట్టడం,స్నానం చేయగూడదు. క్రేన్లు, ట్రాక్టర్లుతో చేసేపనులు ఆపాలి. మోటారు సైకిళ్లు మీద ప్రయాణం చెయ్యకూడదు. సెల్ ఫోన్లులో మాట్లాడకూడదు. బయట ఉన్నప్పుడు నేలమీద నిల్చొని ఉండక కాలివేళ్ళమీద బంతిలా కిందకు వంగి చేతులను చెవులపై ఉంచి నేలపై పరుండాలి. ఇక ఇంట్లో ఉన్నవారు కూడా బాల్కనీలో ఉండకూడదు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడగూడదు.
నీటి గొట్టాలను ముట్టకుండా నీటికి దూరంగా ఉండాలి. అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్ ఆఫ్ చేయాలి. లేదంటే పాడయ్యే అవకాశాలు ఎక్కువ. పెద్ద పెద్ద భవనాలకు పై భాగంలో లైట్నింగ్ కండక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. పిడుగులను ఆపలేకపోయినా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలము. విపత్తు నిర్వహణ శాఖ 30 నుండి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఉన్న ప్రజల ఫోన్లకు ఎస్ఎంఎస్ లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ మొబైల్ ఫోన్ యాప్ దామిని ని ప్రవేశపెట్టారు. ఇది ఫోన్ చుట్టూ కనీసం 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల సమాచారాన్ని తెలుపుతుంది. వీటిని పాటించాలి.
విపత్తుగా ప్రకటించాలి
కేంద్రం పిడుగులను విపత్తుగా పరిగణించదు. అందువలన పిడుగువలన మృత్యువాత పడే వారికి తగినంత ఆర్థిక సహాయం అందడం లేదు. పిడుగుపాటును కూడా విపత్తుగా పరిగణించాలని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
జనక మోహన రావు దుంగ
యం.యస్సీ ( ఫిజిక్స్ )
8247045230





