- జయజయహే తెలంగాణ గీతం గురించి తెలుసా..
- రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని, రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టగా, తాజాగా రాష్ట్ర రాజముద్రపై సైతం మార్పులు చేపడుతుండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ రూపొందించిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా- జమునా తహజీబుకి ప్రతీకలుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం.. రాచరిక పోకడనట అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతంలో మాత్రం రాజముద్రలో ఉన్న చార్మినార్ గురించి ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్‘ అని పాడుకోవాలి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప‘ అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి ! అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని, ఆయన మంత్రి వర్గంలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా? అని సోషల్ వ్నిడియా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇదేం రెండునాల్కల వైఖరి..ఇదెక్కడి మూర?పు ఆలోచన అంటూనే కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు అని కేటీఆర్ ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని కేటీఆర్ పేర్కొన్నారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని ప్రశ్నిస్తూ..కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే ఈ చార్మినార్ చిహ్నమని, అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..అని విమర్శిస్తూ..రెండు నాల్కల ధోరణి ఏంటని ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు..విశ్వనగరం హైదరాబాద్‌కు ఐకాన్ అన్నారు. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం కానీ.. వాటిని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అని, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులు ఉంటే..అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగిస్తుందా చెప్పండంటూ ప్రశ్నించారు.
భారత జాతీయ చిహ్నంలో అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన 3 సింహాలు ఉన్నాయని, జాతీయ పతాకంలో ధర్మచక్రం ఉందని, వాటిని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా..అసెంబ్లీని కూల్చేస్తారా..అంటూ ప్రశ్నించారు. నేడు తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ రాష్ట్ర ప్రజల ఆమోదం ఉందని, సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకం సైతం ఉందన్నారు. కానీ నేడు రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో తెలంగాణ అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఓరుగల్లు సాక్షిగా…వారి సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరించి, తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెటిఆర్ హెచ్చరించారు.





