పాలమూరు-రంగారెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

  • ఎన్టీటి జరిమానాపై స్టే
  • తాగు నీటి ప్రాజెక్ట్ ‌పనులు కొనసాగించవచ్చన్న ధర్మాసనం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్‌ఎన్‌ఎ) : ‌పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌ఖన్నా, జస్టిస్‌ ఎమ్‌ ఎమ్‌ ‌సుందరేష్‌ ‌ధర్మాసనం విచారణ జరిపింది.  ‘తాగునీటి ప్రాజెక్టు’ పనులు మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. 7.15 టీఎంసీల తాగునీరు పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. మరోవైపు..ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎన్‌జీటీ విధించిన 500 కోట్ల జరిమానాపై స్టే విధించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌పై శుక్రవారం ఉదయం సుప్రీమ్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీమ్‌ ‌కోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ ‌చేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే విధించింది. ప్రాజెక్టు సంబంధించి పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకుకోవాలని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కునవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు  ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ప్రతివాదులు అంతా… కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగష్టులో చేపట్టనున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *