పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఇందుకు అదనంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, ప్రతీ పార్టీ మిగిలిన రెండు పార్ట్టీల  మేనిఫెస్టోలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిలో ఉన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమతే చివరి రోజునైనా మరో రెండు మూడు కొత్త అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు భోగట్టా. గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను, విద్య్ధిక యువతను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని, అధికారం చేజిక్కించుకోవచ్చనే ధీమాతో పార్టీల అధినాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ మూడోసారి గెలుపు ధీమాతో ఉండగా, అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా బిజెపి, కాంగ్రెస్ అధినేతలు పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు ప్రచారంలో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.

దాదాపు 42 పేజీలతో, మొత్తం 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే.. నిరుద్యోగ నిర్మూలన,ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఏబీసీడీ వర్గీకరణ, బెల్ట్ షాపులు రద్దు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఎంటి స్థలం, గౌరవ భృతి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,3 లక్షల వడ్డీ లేని పంట రుణం, కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, చెరువుల నిర్వాహణ‌, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత, తొలి క్యాబినెట్‌లో మెగా డీఏస్సీ,

రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్, విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, రేషన్ ద్వారా సన్న బియ్యం , రేషన్ డీలర్‌లకు రూ.5 వేల గౌరవ భృతి, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి, ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం, మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి, 100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం, ఎన్నారైల సంక్షేమ బోర్డ్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు. అలాగే జాబ్ క్యాలెండర్‌‌ను కూడా పార్టీ విడుదల చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

భగవద్గీత, ఖురాన్, బైబిల్

తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని, సర్వమతాలకు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ పత్రమని, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ నేతలు,కార్యకర్తలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

భారాస మేనిఫెస్టో

image.pngతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ను ప్రకటించింది. బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీలను మీడియాకు వెల్లడించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల పరిగణనలోకి తీసుకున్నామన్న సీఎం.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం.. దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే తొలి నుంచి తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. గతంలో అనేక కార్యక్రమాలు చేప్టటామని.. ఈసారి కూడా అలాగే చేస్తామన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు.

కేసీఆర్‌ కీలక హామీలివే..

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా:  తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా. దీనిద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది. ఆసరా పింఛను రూ.5,016కి పెంపు. ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా.. తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతారు. ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 ఇస్తారు.దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంపు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి ₹15లక్షలకు పెంపు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం. అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా.

రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంపు. పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం. ప్రజల ఆశీర్వాదంతో భారాస ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే ఈ హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తాం. దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం. లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం, అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల, మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు, రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ, ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్‌ కోసం కమిటీ ఏర్పాటు.

బి జె పి మేనిఫెస్టో

image.pngసకల జనుల సౌభాగ్య తెలంగాణ.. మన మోదీ గ్యారంటీ- బీజేపీ భరోసా పేరుతో.. 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది కమలం పార్టీ. మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో.. ముఖ్యంగా 10 అంశాలపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమంతో పాటు ప్రజలకు సుపరిపాలన అందించటమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టనున్నట్టు అమిత్ షా తెలిపారు. అవినీతిని ఉక్కుపాతంతో అణచివేయటంతో పాటు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్.. నినాదంతో పాలన సాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే.. మేనిఫెస్టోలోని 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను అమిత్ షా ప్రకటించారు. మేనిఫెస్టోలో ప్రధానాంశాలుగా ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ పేర్కొంది.

బీజేపీ మేనిఫెస్టోలోని పది అంశాలు ఇవే.. రైతే రాజు- అన్నదాతలకు అందలం, విద్యా శ్రీ- నాణ్యమైన విద్య, ప్రజలందరికీ సుపరిపాలన- సమర్థవంతమైన పాలన, యువశక్తి-ఉపాధి, వారసత్వం-సంస్కృతి చరిత్ర, సంపూర్ణ వికాసం- పరిశ్రమలు, మౌళిక వసతులు, నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వైద్యశ్రీ- నాణ్యమైన వైద్యసంరక్షణ, వెనుకబడిన వర్గాల సాధికారికత- అందరికీ చట్టం సమానంగా వర్తింపు, కూడు-గూడు ఆహార నివాస భద్రత.

ముఖ్య అంశాలు

ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్.  కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ.  రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్.  4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత.  సబ్సిడీపై విత్తనాలు… వరిపై బోనస్.  ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.  ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు.  ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ.  బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు.  ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు.  నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ,  ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు..  ఫృఛ్ పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి ఫృఛ్,  జీఓ 317 పై పునసమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్లు, 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులను పంపించేస్తాం, తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట బీమా… బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు,  వృద్ధులకు కాశీ, అయోధ్య ఉచిత ప్రయాణం.

మేనిఫెస్టోలపై  ప్రజల భిన్నాభిప్రాయాలు.

తెలంగాణలో ప్రధాన పార్టీల మేనిఫెస్టోలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోలోని కొన్నిటిలో ఉమ్మడి అంశాలు ఉన్నాయి. 66 హామీలు, 6గ్యారెంటీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసినట్లు చెప్పారు బీజేపీ నేతలు. 10 అంశాలు కలిగిన సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ… బీజేపీ భరోసా’మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

అయితే ప్రధాన పార్టీల మేనిఫెస్టోను పరిశీలిస్తే కొన్ని కొన్ని అంశాలు కామన్‌గా మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామంటే, దాన్ని బీఆర్ఎస్ రూ.400 లకే అందిస్తామని చెప్పింది. ఇదే అంశంపై బీజేపీ ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ధరణి యాప్‌ ద్వారా ఎంతో మేలు చేశామని బీఆర్ఎస్ చెబుతుంటే, ధరణి ద్వారా అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ధరణి ప్లేస్‌లో కాంగ్రెస్‌ మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామంటే, బీజేపీ మీ భూమి వ్యవస్థను తీసుకు వస్తామని చెబుతున్నది. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ రేట్ల.. రైతుల దగ్గర నుంచి సింగరేణి కార్మికులు,. ప్రభుత్వ ఉద్యోగులు,  డొమెస్టిక్ వర్కర్స్  అన్ని వర్గాల ప్రయోజనాలకు హామీలు ఇచ్చింది  పార్టీ.
ప్రజా పాలన విషయంలో కాంగ్రెస్ సుపరిపాలను అందిస్తామంటున్నది.  బీజేపీ ప్రజలందరికీ సుపరిపాలన – సమర్థవంతమైన పాలన అందిస్తామని చెబుతున్నది. రైతు బంధు, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 భోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్తే, బీజేపీ వరికి రూ.3,100 మద్దతు ధర ప్రకటించింది. ఇక ఉద్యోగాల కల్పన, బీమా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అంశాల్లో చిన్న మార్పులు ఉన్నాయే తప్ప ఒకే మాదిరి ఉన్నాయనే వినిపిస్తుంది. 18 ఏళ్లు పైబడి చదువుకునే యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే, బీజేపీ మాత్రం ల్యాప్‌ టాప్ ఇస్తామని చెప్పింది.
బీజేపీ, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలలో ఎవరేం హామీ ఇచ్చారనే చర్చతోబాటు. ఎవరికి ఓటేస్తే.. ఏం వస్తుందని  అలోచించుకుంటున్నారు. అన్ని మ్యానిఫెస్టోలు పరిశీలిస్తే మహిళా ఓటు బ్యాంక్ కే ప్రాధాన్యతనిచ్చినట్లు   కనిపిస్తోంది. అర్హులైన వారికి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని   బీఆర్ఎస్ ప్రకటించగా.. ప్రతీ ఇంటికి 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే.. బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ‘ధరణి’ పై కాంగ్రెస్, బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుండడంతో ఈ ఎన్నికల్లో రాజకీయం భూమి చుట్టూ తిరుగుతున్నది. దీంతో, అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వగా,  ‘భూమాత’ పోర్టల్ ద్వారా భూ హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థానంలో “మీ భూమి” అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అందిరి భూమికి భద్రత కల్పిస్తామని బీజేపీ మాట ఇచ్చింది.
కొంతకాలంగా దేశవ్యాప్తంగా రాజకీయం బీసీల కేంద్రంగా సాగుతోంది. ఇది తెలంగాణలో కూడా మినహాయింపు కాదు. అందుకే బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ తెలిపింది.   బీసీల కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక బీజేపీ అయితే.. బీసీ నేతనే సీఎంని చేస్తామని తెలిపింది.
ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇవ్వగా.. అధికారంలోకి వస్తే.. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడంతో పాటు మోకాలు సర్జరీకి కూడా ఈ పథకం వర్తింప చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ తెలపగా.. ప్రతీ జిల్లాల్లో రెసిడిన్సియల్స్ స్కూళ్ల ఏర్పాటు చేస్తామని.. మరో4 ట్రిపుల్ ఐటీల కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు.. అన్ని ప్రైవేటు స్కూలు ఫీజులపై పర్యవేక్షణ జరుపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు నెలకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని అధికార బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రతీ మహిళకు మహాలక్ష్మీ పథకం ద్వారా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని.. మహిళల కోసం 10 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టిస్తామని బీజేపీ ప్రకటించింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోల్లోని కొన్ని అంశాలు ఒకే విధంగా ఉన్నాయని, మూడు పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ అంశాలేంటి? ఎవరు ఎవరిని చూసి కాపీ కొట్టారన్న అనుమానాలతోపాటు తమకు ఏవి దీర్ఘకాల ప్రయోజనకారిగా ఉంటాయో ఆ పార్టీకి ఓటు చేయాలన్న మాట వినిపిస్తున్నది

-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్, 98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *