తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఇందుకు అదనంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, ప్రతీ పార్టీ మిగిలిన రెండు పార్ట్టీల మేనిఫెస్టోలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిలో ఉన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమతే చివరి రోజునైనా మరో రెండు మూడు కొత్త అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు భోగట్టా. గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను, విద్య్ధిక యువతను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని, అధికారం చేజిక్కించుకోవచ్చనే ధీమాతో పార్టీల అధినాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ మూడోసారి గెలుపు ధీమాతో ఉండగా, అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా బిజెపి, కాంగ్రెస్ అధినేతలు పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు ప్రచారంలో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.
రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్, విద్యా రంగానికి బడ్జెట్లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, రేషన్ ద్వారా సన్న బియ్యం , రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ భృతి, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి, ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం, మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి, 100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం, ఎన్నారైల సంక్షేమ బోర్డ్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు. అలాగే జాబ్ క్యాలెండర్‌ను కూడా పార్టీ విడుదల చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
భగవద్గీత, ఖురాన్, బైబిల్
తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని, సర్వమతాలకు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ పత్రమని, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ నేతలు,కార్యకర్తలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
భారాస మేనిఫెస్టో
కేసీఆర్ కీలక హామీలివే..
కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా: తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా. దీనిద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది. ఆసరా పింఛను రూ.5,016కి పెంపు. ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా.. తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతారు. ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 ఇస్తారు.దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంపు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి ₹15లక్షలకు పెంపు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం. అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా.
రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంపు. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం. ప్రజల ఆశీర్వాదంతో భారాస ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే ఈ హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తాం. దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం. లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం, అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల, మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు, రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ, ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు.
బి జె పి మేనిఫెస్టో
బీజేపీ మేనిఫెస్టోలోని పది అంశాలు ఇవే.. రైతే రాజు- అన్నదాతలకు అందలం, విద్యా శ్రీ- నాణ్యమైన విద్య, ప్రజలందరికీ సుపరిపాలన- సమర్థవంతమైన పాలన, యువశక్తి-ఉపాధి, వారసత్వం-సంస్కృతి చరిత్ర, సంపూర్ణ వికాసం- పరిశ్రమలు, మౌళిక వసతులు, నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వైద్యశ్రీ- నాణ్యమైన వైద్యసంరక్షణ, వెనుకబడిన వర్గాల సాధికారికత- అందరికీ చట్టం సమానంగా వర్తింపు, కూడు-గూడు ఆహార నివాస భద్రత.
ముఖ్య అంశాలు
ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత. సబ్సిడీపై విత్తనాలు… వరిపై బోనస్. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ. బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు.. ఫృఛ్ పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి ఫృఛ్, జీఓ 317 పై పునసమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్లు, 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులను పంపించేస్తాం, తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట బీమా… బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు, వృద్ధులకు కాశీ, అయోధ్య ఉచిత ప్రయాణం.
మేనిఫెస్టోలపై ప్రజల భిన్నాభిప్రాయాలు.
తెలంగాణలో ప్రధాన పార్టీల మేనిఫెస్టోలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలోని కొన్నిటిలో ఉమ్మడి అంశాలు ఉన్నాయి. 66 హామీలు, 6గ్యారెంటీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసినట్లు చెప్పారు బీజేపీ నేతలు. 10 అంశాలు కలిగిన సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ… బీజేపీ భరోసా’మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ప్రజా పాలన విషయంలో కాంగ్రెస్ సుపరిపాలను అందిస్తామంటున్నది. బీజేపీ ప్రజలందరికీ సుపరిపాలన – సమర్థవంతమైన పాలన అందిస్తామని చెబుతున్నది. రైతు బంధు, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 భోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్తే, బీజేపీ వరికి రూ.3,100 మద్దతు ధర ప్రకటించింది. ఇక ఉద్యోగాల కల్పన, బీమా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అంశాల్లో చిన్న మార్పులు ఉన్నాయే తప్ప ఒకే మాదిరి ఉన్నాయనే వినిపిస్తుంది. 18 ఏళ్లు పైబడి చదువుకునే యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే, బీజేపీ మాత్రం ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పింది.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్, 98481 28215




