వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారెంటీల అమలు
ఆయన పాదయాత్రతోనే కాంగ్రెస్‌కు అధికారం
రాహుల్ పాదయాత్రతోనే రాష్ట్రంలో అధికారం…కేంద్రంలో ప్రతిపక్ష హోదా
వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
ఆగస్ట్ 15 కల్లా రుణమాఫీ చేసి తీరుతామన్న భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్సార్ పాలన అని, వైఎస్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని, వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సిఎం అన్నారు. సోమవారం వైఎస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనకు ఘన నివాళి అర్పించారు. వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, కేవీపీ రామచంద్రారవు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిందని, ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని అన్నారు.
రాహుల్‌ను ప్రధాని చేయాలని వైఎస్‌ఆర్ సంకల్పించారని, రాహుల్‌ను ప్రధానిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుందని, వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే రాహుల్‌ను ప్రధానిని చేసే విధంగా ముందుకెళ్లాలని రేవంత్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ఆశయం అంటే సంక్షేమం, అభివృద్ధి. మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన వారికి ఛైర్మన్ పదవులు ఇచ్చాం. ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదు. పీసీసీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా అని రేవంత్ తెలిపారు.దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్ అనేవారని, కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు.
రాహుల్ పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్ చేసిన పాదయాత్ర అని, రాహుల్ పాదయాత్ర కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమని అన్నారు. రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని, ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలోనే అన్నారని, రాహుల్ ప్రధాని కావడం నేటి చారిత్రక అవసరమన్నారు. కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, ఆయనను ప్రధాని చేయడానికి కృషి చేసేవారే వైఎస్ వారసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు వైఎస్ వారసులు కాదన్నారు. రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు 35 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామన్నారు. ఒక్కరు కూడా పైరవీకారులు లేరని, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్‌లాగా ప్రజల కోసం పని చేస్తామని తెలిపారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదవాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమాన్ని పొందారని గుర్తుచేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. రాబోయే రెండు దశాబ్దాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం నాయకులందరం కలిసికట్టుగా ఉందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో భారీ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరిగేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాత నాయకులందరూ పార్టీలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.



