అనుబంధ సంస్థలపైనా నిషేధం విధింపు
కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 28 : గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిఎఫ్‌ఐ ని నిషేధించడానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అనుబంధ సంస్థలపై సైతం నిషేధం ప్రకటించింది. పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలైన అఈఎ, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్‌ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించినట్లు సమాచారం. మూడు సార్లు జరిగిన దాడుల్లో… ఈ మూడు రాష్టాల్ల్రో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా.. పీఎఫ్‌ఐను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంస్థపై నిషేధం ఉండటంతో… పీఎఫ్‌ఐకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.




