ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్‌జోన్ డీసీపీ సాయి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : హైదరాబాద్ పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్‌జోన్ డీసీపీ సాయి తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ వి•డియాలో వదంతులను నమ్మొద్దన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు. యువతను ఉద్దేశపూర్వకంగా కొందరు రెచ్చగొడుతున్నారని ఆయన గ్రహం వ్యక్తం చేశారు. రాజకీయలబ్ది కోసం కొందరు చేస్తున్న కుట్రల్లో యువత పడొద్దని సూచించారు. ఇదిలా వుంటే హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత కొనసాగుతుంది.
ఎంఐఎం కార్యకర్తలు రోడ్ల పైకి వొచ్చి ఆందోళన చేసారు. నిరసనకారుల ఆందోళనతో పోలీస్ వాహనం ధ్వంసమైంది. దీంతో పాతబస్తీకి అదనపు బలగాలు తరలించారు. కార్యకర్తలను సర్దిచెప్పేందుకు యత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ వాహనంపై యువకులు రాళ్లు రువ్వారు. ముందస్తుగా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పాత బస్తీలో హై అలర్ట్ కొనసాగుతుంది. రాజాసింగ్‌ను రిలీజ్ చేయాలంటూ కోర్టు ఆదేశాలివ్వడంతో పోలీసులు మంగళ్ ఘాట్ లోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఈ సందర్భంగా..తెలంగాణ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయం తనవైపే ఉందని..త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం తనకు న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చిందన్నారు.




