- ఉజ్వల గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూ.300లకు పెంపు
- రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలు తేల్చడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు
- కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు…వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్ టాకూర్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 4 : మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, ములుగులో సమ్మక్క-సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్‌పై ఇప్పుడున్న రూ.200 సబ్సిడీని 300లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ టాకూర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు, అట్లాగే రూ.889 కోట్లతో ములుగులో సమ్మక్క-సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని టాకూర్ వెల్లడించారు.
ఇక చాలా కాలంగా తెలంగాణ డిమాండ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం వాటాలు తేల్చడానికి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం లభించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాలలో వాటాలు తేల్చాలని కృష్ణా ట్రిబ్చునల్‌ను ఆదేశించినట్లు టాకూర్ చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఈ నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని తెలిపారు. ఇక ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్‌పై ప్రస్తుతమున్న రూ. 200ల సబ్సిడీని రూ.300 లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని టాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఉజ్వల పథకం కింద 14.02 కిలోల గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర 903 ఉండగా లబ్దిదారులు రూ. 703 చెల్లిస్తున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఇకపై లబ్దిదారులకు రూ. 603 కే సిలిండర్ లభించనుంది.





