ఎన్నికలు సమీపిస్తున్నాయి. మధ్యలో కేవలం ముప్పై నాలుగు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. రాష్ట్రంలో పోటీ పడుతున్న పార్టీల్లో ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ ముందంజలో ఉంది. 119 సీట్లకు గాను 115 అభ్యర్ధులను ప్రకటించడంతోపాటుగా, వారికి బి ఫామ్‌లను కూడా ఇచ్చింది. అభ్యర్ధులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు మొదటి జాబితాను విడుదలచేసి, రెండవ జాబితా విషయంలో కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక పూర్తి స్థాయిలో కాకపోవడంతో మిగతా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ లభిస్తుందోనన్న ఆందోళనతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం కాస్తమందగిస్తున్నది. ప్రధానంగా అయారామ్ … గయారామ్‌లతో ఎప్పుడు ఎవరు ఏ పార్టీకి రాజీనామా చేస్తారో, ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి. ప్రజాబలం ఉన్న నేతలు తమ పార్టీలో చేరుతున్న క్రమంలో వారుకోరుకునే స్థానాన్ని కేటాయించాల్సి ఉండడంవల్ల కాంగ్రెస్, బిజెపిలు తమ రెండవ జాబితాను ప్రకటించే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇటీవల బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయనే చెప్పాలి. ఆ పార్టీలో చేరిన బడా నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతుండడం ఒక విధంగా బిజెపికి పెద్ద షాక్‌గా మారింది. వాస్తవంగా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటినుండి బిజెపి చెబుతూనే ఉంది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కునే సత్తా తమ పార్టీకే ఉందని, ఈసారి గోలకొండ కోటపైన కాషాయ జండాను ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తంచేసింది. ఆమేరకు రాష్ట్రంలో ఒక ఊపును తీసుకు వొచ్చిందికూడా. కాని, ఇటు మునుగోడు, అటు కర్ణాటక ఎన్నికల అనంతరం ఆ జోరు కాస్తా తగ్గినట్లు కనిపిస్తున్నది. దానికి తగినట్లుగా రాష్ట్ర నాయకత్వ మార్పుకూడా ఆ పార్టీ దూకుడుకు కళ్ళెం వేసినట్లు అయింది. బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంపట్ల స్థానిక నేతల్లోనే కొంత అసంతృప్తి చోటుచేసుకుంది. అలాగే బిఆర్‌ఎస్‌ను ఎదుర్కుని రాష్ట్రంలో అధికారానికి వొస్తుందన్న ఉద్దేశ్యంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల నుండి పలువురు నాయకులు కాషాయ కండువ కప్పుకున్నారు. కాని, ఎక్కువకాలం ఆ పార్టీలో ఇమడలేక పోతున్నట్లు ఒక్కొక్కరుగా అక్కడినుండి జారుకోవడం ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడమేనన్న భావన కలిగిస్తున్నది.
ప్రధానంగా ఒంటరిగా పోటీచేస్తానని చెప్పిన బిజెపి జనసేన నేత పవన్‌కళ్యాణ్‌తో పొత్తుకు సిద్ధమయింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో మైత్రికో, సన్నిహితానికో తరుచు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ నాయకుడు నడ్డాలను కలుసుకునేందుకు పవన్ వెళ్ళేవాడు. కాని పవన్‌తో పొత్తుపెట్టుకోవ డానికి ఇప్పుడు స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌లు వెళ్ళారంటే పవన్‌తో కలవడానికి బిజెపి వెంపర్లాడుతున్నదన్న అనుమానానికి తావేర్పడుతున్నది. ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని సాధించలేమన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలకు కలిగిఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈసారి జనసేన తెలంగాణలో పోటీచేస్తానని ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో సెటిలర్ల వోట్ల పైనే పవన్ కళ్యాణ్ ఆశపెట్టుకున్నాడు. ఏపిలో టిడిపితో కలిసి పోటీచేసే విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన పవన్ ఇక్కడ టిడిపి అనుకూల వోట్ల్లను కూడా రాబట్టుకోవచ్చన్న ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. సెటిలర్స్ ఉన్న నియోజక వర్గాలను కలుపుకుని మొత్తం 32 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తున్నట్లు పవన్ ముందుగానే ప్రకటించాడు. అభ్యర్ధులను కూడా సిద్ధం చేసినట్లు తెల్పడమైంది.
ఇప్పుడు బిజెపి 52 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే చాలామంది సీనియర్లను పక్కకు పెట్టింది. సీనియర్లు అయి ఉండి మొదటి జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అలిగిన కొందరు పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి కొందరు ఇంకా తటస్థావస్తలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మునుగోడు ఉపఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం తాను కాషాయ కండువ తీసేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఆయన తన మాతృసంస్థ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. అధికార బిఆర్‌ఎస్‌ను శంకరగిరి మాణ్యాలకు పంపించాలన్న తమ లక్ష్యాన్ని విజెపి నెరవేర్చలేకపోతున్నదన్నది ఆయన ఆరోపణ. అందుకే కాంగ్రెస్‌లో చేరి గజ్వెల్‌లో కెసిఆర్‌ను ఢీ కొనాలన్నదే తన లక్ష్యమంటారాయన. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,వివేక్ వెంకటస్వామి,డికె అరుణ లాంటి వారు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడడంలేదా, లేక వారికి పార్టీ టికట్ కేటాయించలేదా అన్న విషయంలో ఇంకా స్పష్టతలేదు.
బండి సంజయ్‌ను తగ్గించి, ఈటలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటినుండి మౌనంగా ఉంటున్న విజయశాంతి పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటంలేదన్న విషయం తెలియంది కాదు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా తాజాగా కాంగ్రెస్ తీర్థం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ యువశక్తిగా పోరాటం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి తన మాతృపార్టీ బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ క్రమంలో ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క టిడిపి తెలంగాణ ఎన్నికల రంగంలోకి దిగడానికి ఈటలకు ఉన్నాయి. ఈ సరిస్థితిని బిజెపి ముందస్తుగా ఊహించిందోలేదోగాని, ఇప్పుడైతే పవన్‌తో ముందస్తుగా చేతులు కలిపే ఆలోచన చేస్తోంది. పవన్ ఏపిలో టిడిపితో కలిసి పనిచేస్తానని ప్రకటించిన క్రమంలో తెలంగాణలో అదే పరిస్థితి ఏర్పడితే బిజెపి వారితో కలిసి పోటీచేస్తుందా? దాని వల్ల ఒంటరిగా బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకపోయిందన్న అపవాదును ఆ పార్టీ మూటగట్టుకుంటుందా అన్నది తేలాల్సిఉంది.





