చిన్నకోడూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని.. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు.స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన చిన్నకోడూరులో మహిళలు, పారిశుధ్య కార్మికులతో కలిసి ఆదివారం శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పల్లె సీమలే దేశానికి పట్టు కొమ్మలనే మహాత్మా గాంధీ చెప్పిన మాటను గుర్తు చేశారు. పల్లెలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే దేశం బాగుంటుందన్నారు. శ్రమ అనే భావం లేకుండా ప్రతి ఒక్కరూ శ్రమ దానం చేయాలన్నారు. రోజు ఒక్క గంట పాటు శ్రమ దానం చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, ఇంటి పరిసరాలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దీంతో ఈగలు, దోమల వల్ల అనారోగ్యం బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరించి డంప్ షెడ్డు లో ఎరువుగా మార్చడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మునిరుద్దీన్, మండల కో ఆప్షన్ మెంబర్ సాధక్, పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం





