2003 నుండి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28న ప్రపంచ సేఫ్టీ అండ్ హెల్త్ యట్ వర్క్ ( పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం ) దినోత్స వాన్ని పాటిస్తుంది. ఈ రోజు వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలో సూచిస్తుంది. వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధులు కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థలపై వినాశకరమైన ప్రభావాలకు దారితీస్తాయి. అనేక మెరుగుదలలు ఉన్నప్పటికీ పని సంబంధిత ప్రమాదాలు వ్యాధుల నివారణ ప్రపంచ స్థాయిలో గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
ఆరోగ్యం – భద్రత ఎందుకు..?
పనిచేసే చోట పనిచేసే వారందరికీ ఆరోగ్యం, భద్రత కల్పిస్తే వారికి తమ పని పరిస్థితుల్లో భద్రంగా ఉండేలా సహాయ పడుతుంది. ఉద్యోగుల్లో గైర్హాజరు తగ్గుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏమి చెబుతుంది..
పరిశ్రమలలో, నిర్మాణరంగంలో, రవాణా రంగంలో, బహిరంగ ప్రదేశాలలో, రైతులతో సహా వ్యవసాయంలో చాలా మంది పనిచేస్తున్నారు. అత్యవసర కార్మికులు, క్లీన్ అప్ కార్మికులు, మత్స్యకారులు, చిత్రకారులు తమ తమ ప్రదేశాలలో పని చేస్తున్నారు. పరిశ్రమలలో పనిచేసే వారిపై అధికవేడి, అతినీలలోహిత వికిరణం, విపరీత వాతావరణ సంఘటనలు, కార్యాలయంలో వాయు కాలుష్యం, సంక్రమణ వ్యాధులు, వ్యవసాయ రసాయనాల ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) యొక్క కొత్త నివేదిక ప్రకారం వాతావరణ మార్పు ఇప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని కార్మికుల భద్రత ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. ఐఎల్‌ఒ అంచనా ప్రకారం 3.4 బిలియన్ల ప్రపంచ శ్రామికశక్తిలో 2.41 బిలియన్ల కంటే ఎక్కువ మంది కార్మికులు వారు పనిచేస్తున్న ప్రదేశాలలో ఏదో ఒక సమయంలో అధిక వేడికి గురవుతున్నారు.
గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో వాటాగా లెక్కించినప్పుడు 2000 నుండి ఈ నిష్పత్తి 65.5 శాతం నుండి 70.9 శాతానికి పెరిగింది. యేటా 22.85 మిలియన్ల వృత్తిపరమైన గాయాలుకు, 18,970 పని సంబంధిత మరణాలుకు, 2.09 మిలియన్ల మందికి ఆయుర్దాయం తగ్గడానికి, 26.2 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బారిన పడడానికి ఈ అధిక వేడి కారణమవుతుంది. 1.6 బిలియన్ కార్మికులు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురవుతున్నారు. నాన్ మెలనోమా చర్మ క్యాన్సర్‌తో ఏటా 18,960 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాయు కాలుష్యానికి గురగుచున్న 1.6 బిలియన్ల మందిలో యేటా 8,60,000 మంది చనిపోతున్నారు. పరాన్నజీవులు, సూక్ష్మజీవులు ద్వారా సంక్రమించే వ్యాధులకు గురికావడం వల్ల ప్రతి సంవత్సరం 15,170 మంది మరణిస్తున్నారు. 870 మిలియన్లకు పైగా కార్మికులమీద వ్యవసాయ పురుగుమందుల రసాయనాల ప్రభావం ఉంది.
ఏటా 3,00,000 కంటే ఎక్కువ మరణాలు పురుగుమందుల విషంతో సంబంధం ఉన్నాయి. పనిచేసే వారి మానసిక ఆరోగ్యం సమాజంపై పని ప్రపంచంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. నిరాశ ఆందోళన కారణంగా ప్రతి సంవత్సరం 12 బిలియన్ పని దినాలు వృధా అవుతున్నాయి. పేలవమైన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. పనిలో ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది. భౌతిక ప్రమాదాలు అక్కడ పనిచేసే వారికి శారీరక లేదా గాయాన్ని కల్గించవచ్చు. అధిక శబ్ధం, వైబ్రేషన్లు, రేడియేషన్లు, విద్యుత్ పరికరాలు, బాయిలర్లు ప్రమాదాలు కలిగిస్తాయి. పెద్ద శబ్దం కార్మికుల వినికిడిని దెబ్బతీస్తుంది. అధిక శబ్దం స్థాయిలు కమ్యూనికేషన్‌కు ఆటంకం కలిగిస్తాయి. హెచ్చరికలను వినడం కష్టతరం చేస్తాయి. కార్మికుల అలసటను పెంచుతాయి. ఒత్తిడి, చిరాకు,నిద్ర రుగ్మతలకు కారణమవుతాయి. పనితీరును తగ్గిస్తాయి.
వాహనాలు లేదా వైబ్రేటింగ్ ఇండస్ట్రియల్ మెషినరీ దగ్గర పనిచేసేటప్పుడు వైబ్రేటింగ్ ఉన్న ఉపరితలంపై పనిచేసే టప్పుడు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైబ్రేటింగ్ వలన తాత్కాలిక వైకల్యం ఏర్పడవచ్చు. దీర్ఘకాలం లేదా పదేపదే గురైతే శాశ్వత నష్టానికి దారితీస్తుంది. అయోనైజింగ్ రేడియేషన్ లేదా నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైతే కణజాల నష్టం క్యాన్సర్‌కు దారితీయవచ్చు. విద్యుత్తు ప్రమాదాలు పరిశ్రమలలో పనిచేసే వారిని చంపవచ్చు లేదా తీవ్రంగా గాయపరచవచ్చు. మరోవైపు తీవ్రమైన శీతల వాతావరణం కూడా కార్మికులకు అనేక రకాల ఆరోగ్య రుగ్మతలను పెంచుతాయి.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి
కర్మాగారాలు, ప్రైవేట్ సంస్థలు తమ రోజువారీ పనిని చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగకుండా నిర్దిష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలి. పనిచేసే వారి ఆరోగ్యం, భద్రత యజమాని యొక్క బాధ్యత.
ప్రతి కర్మాగారాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఉత్పాదక ప్రక్రియ కారణంగా వ్యర్థాలు, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడానికి, వాటిని హానికరం కానివిగా మార్చడానికి, వాటిని పారవేయడానికి సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలి. గాలి, వెలుతురుకు ఇబ్బంది లేకుండా చూడాలి. కార్మికులు అధిక ఉష్ణోగ్రతకు గురికాకుండా చూడాలి. దుమ్ము,పొగ బయటకు పోయే మార్గం ఉండాలి. గాలిలో అనుకూలమైన తేమ ఉండాలి. ఏ కర్మాగారంలోని ఏ గదిలోనూ అక్కడ పనిచేసే కార్మికుల ఆరోగ్యానికి హాని కలిగించేంత రద్దీ ఉండకూడదు. తాగునీరు సౌకర్యం కల్పించాలి. తగినన్ని మరుగుదొడ్లు, మూత్రశాలలు పురుషులతో పాటుగా స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కదిలే యంత్రాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తు ప్రదేశాలలో పనిచేసేటప్పుడు తగు ఏర్పాట్లు చేయాలి.
కళ్లకు రక్షణ కలిగించాలి. ప్రమాదకరమైన పొగలు, వాయువులు రాకుండా చూడాలి. పొరపాటున వస్తే ప్రమాదం జరగకుండా రక్షణ వ్యవస్థ ఉండాలి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ సురక్షితంగా తప్పించుకునే మార్గాలు, మంటలను ఆర్పడానికి అవసరమైన పరికరాలు సౌకర్యాలు ఉండాలి. వాషింగ్ సౌకర్యాలు, దుస్తులను నిల్వ చేయడానికి ఎండబెట్టడానికి సౌకర్యాలు,కూర్చునే సౌకర్యాలు,ప్రథమ చికిత్స ఉపకరణాలు,క్యాంటీన్లు, షెల్టర్లు, విశ్రాంతి గదులు, భోజన గదులు సౌకర్యం కల్పించాలి. అవసరమైన చోట సంక్షేమ అధికారు లును, వైద్యాధికారులును నియమించాలి. కార్మికులకు తగు శిక్షణ ఇవ్వాలి. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోగూడదు.
-జనక మోహనరావు దుంగ
అధ్యాపకుడు 8247045230





