- కేంద్ర మంత్రివర్గంపై రాహుల్ కామెంట్
- ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే వారసత్వ
- రాజకీయాలపై గట్టి కౌంటర్ ఇస్తూ ట్వీట్
- మాటలకు , చర్యలకు పొంతన లేకపోవడమే మోదీ అని ఎద్దేవా
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 11 : రాజకీయ కుటుంబాల నుండి వొచ్చిన మోదీ 3.0 ప్రభుత్వంలోని పలువురు మంత్రులను ప్రస్తావిస్తూ ఎన్‌డిఎ మంత్రిత్వ శాఖను ‘‘పరివార్ మండలం’’ గా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల సందర్భంగా తరచూ గాంధీ కుటుంబాన్ని ఎత్తి చూపుతూ, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను చేస్తుందని విమర్శలు గుప్పించిన మోదీకి మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మంత్రిమండలిలో వారసత్వ రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ కుటుంబాల నుండి వొచ్చిన పలువురు మంత్రులను చేర్చుకున్నందుకు ఎన్‌డిఏ మంత్రి మండలిని ‘పరివార్ మండల్’ అని రాహుల్ ముద్ర వేశారు. తరతరాలుగా సాగుతున్న పోరాటం, సేవ, త్యాగాల సంప్రదాయాన్ని బంధుప్రీతిగా పిలుచుకునే వారు తమ ‘సర్కారీ పరివార్’కు అధికార సంకల్పాన్ని పంచుతున్నారంటూ రాహుల్ ఈ సందర్భంగా హిందీలో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. మాటలకు, చర్యలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని నరేంద్ర మోదీ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ మొదటి ప్రొటెమ్ స్పీకర్ రించిన్ ఖారు కుమారుడు కిరణ్ రిజిజు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కుమార్తె రక్షా ఖడ్సే, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్, మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ, మంత్రి అల్లుడు జేపీ నడ్డా పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి మండలిని ఎన్‌డిఏ ‘‘పరివార్ మండల్’’ గా పేర్కొన్నారు.
జాబితాలో ఇంకా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ టాకూర్ కుమారుడు రామ్ నాథ్ టాకూర్, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు, మాజీ ఎంపీ జితేంద్ర ప్రసాద కుమారుడు జితిన్ ప్రసాద, హర్యానా మాజీ ముఖ్యమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్, మంత్రి రావు బీరేంద్ర సింగ్, కేంద్ర మాజీ మంత్రి వేద్ ప్రకాష్ గోయల్ కుమారుడు పీయూష్ గోయల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు రవ్‌నీత్ సింగ్ బిట్టు, అప్నాదళ్ వ్యవస్థాపకుడు సోనెలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్‌ల పేర్లను కూడా చేర్చారు.





