పరివర్తన దిశ ఎటువైపు…? తిరోగమనమా? పురోగమనమా?

నేటి సమాజాన్ని అనేక వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. దేశ సంపదగా మారవలసిన యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమైపోతున్నది. విశ్వాసం, విలువలు, బాధ్యత వంటి పదాలు బరువుగా మారిపోతున్న నేపథ్యంలో వాడిపోయి జారిపోయి,కాలగర్భంలో కలిసి పోయి, చరిత్రగా మిగిలిన గతకాలపు విలువల సారాంశాన్ని గ్రహించి విజ్ఞతతో మెలగడమే మన ముందున్న కర్తవ్యం. చెడు స్నేహాలకు,నిలువెల్లా కాలకూటవిషం లాంటి ఈర్ష్యాద్వేషాలు నింపుకున్న కాపురుషులకు దూరంగా మెలగడం ఉత్తమోత్తమం. మానవత్వమంటే సహాయం చేయడమని మాత్రమే కాదు, ఇతరుల జీవితాలతో చెలగాడ మాడకుండా,సద్బుద్దితో మెలగడం వివాదాలలోకి పోకుండా ,హితవాక్యప్రబోధాలు చేయడం,చెడుకి దూరంగా ఉండడమే.తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టినట్టు తాను పతనమై,ఇతరులను పతనా వస్థలోకి మళ్ళించడం అత్యంత హేయం.మంచిని వంచించకూడదు. సాధ్యమైనంతవరకూ సహాయాలకు దూరంగా ఉండాలి.సహాయాలకోసం ప్రాధేయపడి ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు .ఇతరుల సహాయానికి చీటికీ మాటికీ అర్ధించడం ఆత్మాభిమాన హననమే. సహాయాలకు వెంపర్లాడవద్దు.అక్కరకు రాని దాష్ఠీకాలు మన గౌరవాన్ని అధః పాతాళంలోకి దిగజారుస్తాయి.దారి తప్పి సకల వ్యసనాలతో బాధపడుతున్న సమాజాన్ని మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా నిత్య కలహభోజన ప్రియత్వంతో, మరింత అధోగతి పాలు చేయవద్దు. అనవసర వాగాడంబరంతో, పరపీడనతో సామాజిక కాలుష్యాన్ని పెంచవద్దు.వీలైతే హితవచనం-కాకుండే వాక్‌ ‌కాలుష్యానికి స్వస్తి వచనం పలకాలి. చెడు ఏనాటికీ నిలబడదు-మంచి ఏనాటికైనా చీకటి తెరలను చీల్చుకుని బయటకు రాక మానదు. చైతన్యం మూర్తీభవించిన వ్యక్తులంతా మంచిని నలుగురికీ ప్రబోధించాలి.

మన మౌనం కలహాలను ఆపగలగాలి. చెడుపై మంచి సాధించిన విజయం సాధించాలి. జనావళి అంతరంగాల్లో మంచిని నింపాలి.సమాజంలో సత్ప్ర వర్తనకు పిడికెడంత చోటు లభించాలి. హింసాదృక్ఫథం యువతలో పెరిగిపోతున్నది. ‘‘హింసరచన, -ధ్వంస వచన’’ అన్నట్టుగా హింస అనేది అతి పెద్ద వ్యూహాత్మక ప్రక్రియ గా మారింది. ఉగ్రవాదం తో మనుషులను చంపే రాక్షస క్రీడ కొందరిదైతే, కారణ రహితంగా తోటి మనుషులను హింసించి బ్రతికే క్రీడా విన్యాసం మరికొందరిది. భౌతిక పరమైన హింసతో తృప్తి పొందే వారు కొందరైతే మానసిక హింసతో మురిసిపోయేవారు మరికొందరు. తనను తాను హింసించుకుని ఆనందించే వారు మరికొందరైతే పరులను తమ మాటలతో, చేష్ఠలతో హింసించి, వారు క్షోభపడితే, వారు పడే బాధలో నుంచి ఆనందాన్ని వెతుక్కునే పైశాచిక మనస్తత్వం మరికొం దరిది. ఉగ్రవాదహింస రాజ్యకాంక్షకోసమో, మతమౌఢ్య ప్రేరితమో కావచ్చు. కాని పరులను మాటలతో, చేష్ఠలతో పీడించు కుతినే మానసిక రోగుల పరపీడనకు కారణ మంటూ ఉండదు.

ఇలాంటి రుగ్మతలు సమాజానికి పెను ప్రమాదం కలిగిస్తున్నాయి. కలహ భోజన ప్రియత్వంతో నిరంతరం తగువులు పెట్టి,ఇతరుల జీవితాలలో చిచ్చుపెట్టి, వారి మరణాలను కారణభూతులౌతున్న వారిలో మార్పు తీసుకురావాలి.

ధనముంటే ‘‘వెంకి’’ ని వెంకటలక్ష్మిగా గౌరవిస్తుందీ సమాజం. ఆర్ధికలేమి వల్ల మన సమాజం మన స్థాయిని దిగజార్చి మాట్లాడుతుంది.’’ శాడిజం’’తో ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి.శాడిస్టు మనస్థత్వాలు మనం చేసే ప్రతీ పనికీ వంకలు పెడతాయి.శాడిస్టు జీవులకు పరులను ఏదో వంకతో వేధించడమే నిత్యాన్న భోజనం.

పరుల జీవితాలతో చెలగాటమాడే ఈ దుష్టత్వం దేనికి? కారణరహిత కక్ష సాధింపులు బహు ప్రమాదకరం. యువత దగ్గరనుండి మధ్యవయస్కులు, వృద్దులు ఒకరేమిటి ఈ రకమైన చేష్ఠలతో చాలా మంది బలైపోతున్నాయి. వీటికి కుల, మత, ప్రాంతీయ బేధాలు లేనే లేవు. విద్యావంతులు, విద్యా విహీనులనే వ్యత్యాసమే అగుపి ంచదు. సర్వాంతర్యామి లా ఖండాంతరాలకు వ్యాప్తి చెందిన మానసిక రుగ్మతలను నిర్మూలించకపోతే సమస్త భారతావని తనకున్న ప్రాచీన సంపదలైన విలువలను కోల్పోవడం ఖాయం. మన దేశం నైతిక విలువలకు, సభ్యతాసంస్కారాలకు పెట్టింది. అవి మిథ్యగా మారడం దురదృష్టకరం.ఒకవైపు సాటి మనుషులను సాధిస్తూ, మరోవైపు భక్తి భావంతో ఊగిపోయే ప్రబుద్ధులను చూస్తున్నాం. అంధవిశ్వాసాలు,మూఢభక్తి మనోక్లేశాలకు విరు గుడు కావు. హింస, అత్యాచారాలు, నోటి దురుసుతనం, శీలహననం, అహంకారం,వాక్కాలుష్యం ఇవన్నీ మనిషిని దిగజార్చే మనో వ్యాధులు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతీ అసహజమైన ప్రక్రియకు మానసిక రుగ్మతలే కారణం. ఈ మానసిక రుగ్మతల నివారణకు చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక చింతన, నైతిక ప్రవర్తన,అభ్యుదయ భావాలతో కూడిన ఆలోచనా సరళే నిజమైన ఔషధాలు.

సుంకవల్లి సత్తిరాజు.

 (సోషల్‌ ఎనలిస్ట్,‌కాలమిస్ట్)

9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *