ఎంత వెర్రి వాణ్ణి!
అంతటా ఒకే పన్ను అనగానే
ఎన్నో ఆశలు
నా ఎదలో పొదలై మొలిచాయి.
చిగురులు వేసే భావాలు
లోలోపల గుసగుసలాడాయి.
మొగ్గలు తొడిగే కొమ్మల్లో
పువ్వులు పూసేలోగా
పన్నులు గుంపులు,గుంపులుగా
ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది
అది అందగత్తె కాదు కురూపి అని.
ఓ నాయకా!
ప్రజాస్వామ్య పంట పొలంలో
కాదేదీ పన్నుకనర్హం అంటూ
పసివాళ్ళు తాగే పాలనుంచి
చావు దాకా
అన్నీ పన్నుపోటుకి గురి చేసావుగా!
నువ్వే అనుకొంటే..
ఉత్పత్తి రంగాన్ని నిర్వీర్యం చేసి,
అభివృద్ధిని గాలికొదిలేసి,
జీవన ప్రమాణాలు పెంచకుండా,
కష్టపడే వారి మీదే పన్నులేస్తూ,
ఉచితాల బటన్ నొక్కుతూ,
తన కష్టార్జన పంచుతున్నట్టు
ఫోజులిస్తూ… ఇక్కడ మరొకరు.
పాలనకు పాకులాడని,
ప్రభుత్వ పథకాలకు కొంగు చాపని,
మధ్యతరగతి జీవికే కష్టాలన్నీ.
ప్రభుత్వాలకు ఆదాయపు వనరూ వారే,
పస్తులుండైనా పన్నుకట్టేదీ వారే.
వారిపై మీ కెందుకింత నిర్దయ?
ఓ నాయకుల్లారా!
సగటు మధ్యతరగతి జీవిగా
పూడుకుపోయిన గొంతుతో అర్ధిస్తున్నా…
మీ స్వార్థానికై చేస్తున్న
ఉచితాల సంతర్పణ మానండి.
మీ పోటీ…
పన్ను,రుణ ఎగవేతదారులకు
రాచమర్యాదలు మానడంలోనూ,
మీ జీతాలు,వైభోగాలు
తగ్గించుకోవడంలోనూ,
అభివృద్ధిలోనూ చూపండి.
మీ పన్నుల పోటుకు విలవిల్లాడిపోయి
ఊబిలో కూరుకుపోయామంటూ..
వెక్కి వెక్కి ఏడుస్తున్న సామాన్యునిపై
ఇక మీ ప్రతాపం చాలించండి.
– వేమూరి శ్రీనివాస్, 9912128967
తాడేపల్లిగూడెం




