- ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరినట్లేనా..
- ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు
- స్వయంకృతాపరాధంతో ప్రజలకు దూరమయిన బిఆర్‌ఎస్
- పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఆధారపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం
హైదరాబాద్, జూన్ 1 : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల దశాబ్దం క్రితం నెరవేరింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నుండీ తమను మరే రాష్ట్ర ప్రజలతో కలుపవద్దని తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం సరిగ్గా ఈ రోజు అంటే 2014 జూన్ 2న నెరవేరింది. దాదాపు అరవై సంవత్సరాలుగా దశలవారీగా ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేశారు. 1969లో జరిగిన పోరాటం చరిత్రలో మరిచిపోలేని ఘట్టంగా నిలిచింది. ఈ పోరాటంలో సుమారు మూడు వందల మంది ప్రాణత్యాగం చేయగా, 2001 నుండి కొనసాగిన మలి ఉద్యమంలో కూడా దాదాపు 12 వందల మంది బలైనారు. అయితే తొలి, మలి ఉద్యమంలోని ఈ త్యాగమూర్తులను అధికారంలోకి వొచ్చిన ప్రభుత్వాలు గుర్తించాయా అంటే ఒక విధంగా లేదనే చెప్పాలె. తొలి ఉద్యమాన్ని అణచివేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే అతర్వాత మరి కొంతకాలం కొనసాగడం ఒకటైతే, మలిదశ ఉద్యమంలో అమరులను గుర్తించడంలో ఉద్యమ పార్టీ నుండి, రాజకీయ పార్టీగా మారి అధికారం చేపట్టిన నాటి టిఆర్‌ఎస్ నేటి బిఆర్‌ఎస్ గడచిన పదేళ్ళకాలంలో పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయలేకపోయిందన్న అపవాద ఉంది. మరణించిన వారిలో సగం కన్నా తక్కువ మందినే ప్రభుత్వం గుర్తించిందన్నది ఆరోపణ. బలిదానం చేసిన వారి పూర్తి వివరాలు తెలియకపోవడమే అందుకు కారణమంటూ గత ప్రభుత్వం దాటవేసింది.
అలాగే లాఠీ, తూటా దెబ్బలు తిన్న ఉద్యమకారులను కాదని, వారిపై దాడిచేసిన రాజకీయ నాయకులను అందలం ఎక్కించడం బిఆర్‌ఎస్ చేసిన పెద్ద తప్పు. కనీసం దానిపై చర్చించేందుకు కూడా ఆయన ఉద్యమ నేతలు, సహచర మంత్రులకు అవకాశం కల్పించలేదన్న ఆరోపణ ఉంది. ఆదే విషయాన్ని ఊటంకిస్తూ పలువురు ఉద్యమ నేతలు పార్టీని వీడిపోవడమే ప్రత్యక్ష నిదర్శనం. ఈ విషయంపై తరుచూ ప్రశ్నిస్తూ వొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వొచ్చింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు వొచ్చాయి. ఈ ఉత్సవాలను గత ప్రభుత్వం కన్నా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గత ప్రభుత్వం దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నప్పటికీ కనీసం రాష్ట్ర గీతాన్ని గుర్తించలేకపోయింది.
రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘జయ జయహే తెలంగాణ’ అన్న గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదిస్తుందని ప్రజలంతా ఎదురు చూశారు. కాని, తన తొమ్మిదేళ్ళపాలనలో దాన్ని పట్టించుకోనట్లుగానే ప్రభుత్వం వ్యవహరించింది. చివరకు అధికారాన్నే కోల్పోయింది. కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్లుగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారానికి దూరం కావడానికికూడా అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ఎవరి సలహాలను, సూచనలను తీసుకోలేదని ఫలితంగా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందన్న నింద నాటి ప్రభుత్వంపై ఉంది. అలాగే అవినీతి అంతమే తమ పంతంగా మొదట్లో చెప్పుకున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అవినీతి, అక్రమాల్లో చిక్కుకోవడంతో ఆ పార్టీపైన, నాయకులపైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లటమే ఓటమికి కారణంగా మారింది.
అంతే గాకుండా ఉట్టికి ఎక్కలేనమ్మ, స్వర్గానికి నిచ్చనేసిందన్నట్లుగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాల్సింది పోయి, దేశాన్ని ఉద్దరిస్తామంటూ నేల విడిచి సాముచేయడం కూడా ఆ పార్టీ చతికిల పడడానికి కారణమైంది. ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్ అంటే కెసిఆరేనని, కెసిఆర్ అంటే తెలంగాణ అని భావించిన తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపర్చే విధంగా పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తీసివేయడం పట్ల కూడా ప్రజ అసహనానికి కారణమైంది. ఆ విషయంలో తెలంగాణ వాదులనేకులు అభ్యంతరం చెప్పినా, ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శించినా అధిష్టానం పట్టించుకోలేదు. అయితే దేశంలోని అనేక పార్టీలను కూడగట్టి వారందరినీ ఏకతాటిపై తీసుకురావడంలో బి(టి)ఆర్‌ఎస్ ముఖ్యభూమికను పోషించిందనడం కూడా కాదనలేనిది. అనేక ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, కార్మికులు, రైతాంగం, చివరకు మావోయిష్టులు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకడం వల్లే నాడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తన అధికారాంతంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడిరది.
తెలంగాణ తామే ఇచ్చామని కాంగ్రెస్, తామే సాధించామని బిఆర్‌ఎస్, అందుకు తాము మద్దతిచ్చామని బిజెపి పార్టీలు చెప్పుకుంటున్నా, సాధించుకున్నది తెలంగాణ ప్రజలు మాత్రమే. రాస్తారోకోలు, వంటావార్పులు, మిలియన్ మార్చ్, సాగర హారం ఇలా చెప్పుకుంటూ పోతే పద్నాలుగేళ్ళకాలం ప్రజలంతా విశ్రమించకుండా చేసిన పోరాట ఫలితమనే చెప్పాలె. ఇదిలా ఉంటే ఈ పదేళ్ళ కాలంలో బి(టి)ఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదా అంటే, ఒక విధంగా తెలంగాణను ఇతర అగ్ర రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్ళిం దనటంలో అతిశయోక్తిలేదు. వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాల్లో పదేళ్ళ కాలంలో పురోగతిని సాధించింది. వ్యవసాయోత్పత్తులు గతంతో పోలిస్తే నాలుగురేట్లు పెరిగాయి. దేశంలో కొత్త రైస్ బౌల్‌గా తెలంగాణ మారింది.
తెలంగాణ ఏర్పడడానికి ముందు 28 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే, తెలంగాణ ఏర్పడ్డాక సుమారు 63 లక్షల ఎకరాల్లో సాగుకావడం విశేషం. అందుకు ప్రాజెక్టుల పునరుద్ధరణ, రూపకల్పన అయితే వాటిల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్న అపవాదను మూటకట్టుకున్నప్పటికీ గతంలో లేని విధంగా 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, గతంలో ఎన్నడూ చూడని విధంగా వివిధ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఏర్పాటు చేయడం. వీటికి తోడుగా 33 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణం. భరోసా కేంద్రాలు, మోడల్ స్మశాన వాటికలు, యాదాద్రి ఆలయ నిర్మాణం, గిరిజనుల తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చడం, పోడు పట్టాల పంపిణీ, నేతన్నలకు పని కల్పించేందుకు బతుకమ్మ చీరలు, వివిధ మతస్తుల పండుగలకు ప్రభుత్వం పక్షాన వస్త్రాల బహుమతి, కెసిఆర్ కిట్‌ల పేర అప్పుడే పుట్టిన పిల్లలకు కిట్‌ల పంపిణీ, జిల్లాలన్నిటిలో కలిపి కొత్తగా 34 వైద్యకళాశాలు, ఐటి రంగంలో బెంగూళూరు ధీటుగా దూసుకుపోవడం, అందుకు కొత్త పారిశ్రామిక పథకం అమలు, రైతు బీమా, రైతుల రుణమాఫీ, రైతు వేదికలు, సమీకృత మార్కెట్‌లు, ధాన్యం సేకరణ, స్వయం సమృద్ధిని సాధించే విధంగా గొర్రెలు, బర్రెల పెంపకం, దళితబంధు లాంటి అనేకానేక అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్ర పురోగమనానికి బాటలు వేసాయి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు మించి అప్పులు చేసిందన్న ఆరోపణ కూడా దానివెంట ఉన్నాయి. కాగా ప్రభుత్వం చుట్టూ అవినీతి, అక్రమాల చిట్టాలు పెనవేసుకున్నాయి. ప్రపంచ అద్భుత కట్టడంగా చెప్పుకున్న కాళేశ్వరం పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వ పరువు తీసింది. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్వయంగా కెసిఆర్ కూతురే జైలు జీవితాన్ని గడుపుతున్న విధానం ఆ పార్టీ పరువును గంగలో కలిపినట్లైంది. దానికి తోడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పరువును మరికాస్తా బజారున పడేసింది.
పదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఆంధప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం సమకూర్చుకోలేక పోయిందన్న అపవాదు ఉంది. అందుకు కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే నీళ్ళు, నిధులు, నియామకాలన్న ట్యాగ్‌లైన్‌తో మొదలైన ఉద్యమం వాటిని నేటికీ సాధించుకోలేకపోయిందన్న ఆరోపణ ఉంది. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా ఎంత అని ఉద్యమకాలం నుండి వేస్తున్న ప్రశ్న, నేటికీ ప్రశ్నగానే ఉంది. ఆస్తులు, అప్పుల పంపకాలు ఇంకా తేలడంలేదు. నాటి విభజన ఒప్పందంలో భాగంగా ఉన్న ఉమ్మడి హైదరాబాద్ సమస్య కూడా నేటితో తేలిపోనుంది.
అయితే ఈ పది సంవత్సరాల్లో ఏపి ప్రభుత్వం తమకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోకపోవడంతో, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరికొంత కాలం కొనసాగించాలని కొందరు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. వాస్తవంగా ఏపి ప్రభుత్వానికి హైదరాబాద్‌తో పనిలేదు. ఇప్పటికే 90 శాతానికి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఏపికి తరలిపోయాయి. అయితే హక్కును వదులుకోలేక కొందరు మరికొంత కాలం ఉండాలని పట్టుపడుతున్నారు. దీనిపైన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాగాంధీని ఈరోజున సన్మానించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతున్నది. అయితే 1200 మందిని బలితీసుకున్న దేవతకు సన్మానమేంటని బిఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రజల నుండి పెద్ద వ్యతిరేకత రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి మారిన స్వల్పకాలంలోనే సిఎంగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డిపైన పెద్ద బాధ్యత ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం, అందుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోవడమన్నది ప్రధానం. మరో రెండు రోజుల్లో రానున్న ఎంపి ఫలితాలతో కేంద్రంలో ఏ ప్రభుత్వం వొస్తుందనేది తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వొస్తే, రేవంత్ వాగ్దానాలను నిలబెట్టుకోవడం కష్టమేమీ కాదు. కాని, బిజెపి ప్రభుత్వం వొస్తే మోదీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తారా అన్నది ఉత్పన్నమవుతుంది. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కునేందుకు ముందునుండే తెలంగాణ వాదులను, ఉద్యమకారులను, మేధావులనందరినీ కూడగట్టే ప్రయత్నంలో బాగంగా దశాబ్ది ఉత్సవాల్లో వారికి స్థానం కల్పించే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తున్నది.





