- సంజీవరావు, విజయ రామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు
- బూతులు మాట్లాడేటోనికి పోలింగ్ బూతులో బుద్ధి చెప్పాలి
- మర్కూక్ ఎన్నికల సభలో మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 17: పదేండ్ల కిందట గజ్వేల్ ఎట్లుండే…ఇక్కడికి కేసీఆర్ వొచ్చినంక ఎట్లుయ్యిందో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు సూచించారు. కేసీఆర్ గజ్వేల్‌కు వొచ్చిన తర్వాత ఎవరూ ఊహించిన రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందనీ, నీళ్లు వొచ్చాయనీ, భూములు ధరలు పెరిగాయనీ, ప్రభుత్వ దవాఖాలను ప్రయివేటు కంటే మంచిగా చేసుకున్నామనీ, రోడ్లు బాగుపడ్డాయన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడంతో ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయన్నారు. గజ్వేల్ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించి మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. పదేండ్ల కింద కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన సంజీవరావు, విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండే. వాళ్లు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది.
కేసీఆర్ వొచ్చాక ఈ ప్రాంతం ఎంతగా అభివృద్ధి అయ్యిందో మీరే ఆలోచన చేయాలన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతమంతా కరువుగొట్టు ప్రాంతమని అనేవారనీ, తాగునీటి కొరత వల్ల మర్కూక్ మండలానికి ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడ ేవారన్నారు. కేసీఆర్ వొచ్చాకనే కదా మర్కూక్ మండల కేంద్రంగా మారిందన్నారు. కేసీఆర్ వొచ్చాకనే కదా ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీటి సమస్యను తీర్చాడన్నారు. కరువు ప్రాంతమైన మర్కూక్‌ను సిఎం కేసీఆర్ శివుడి నెత్తి నుండి గంగమ్మ తల్లి ఎలా బయటకు వొస్తుందో కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి నీళ్లు తెచ్చాడన్నారు. ఎండ కాలంలో కాలువల్లో నీళ్లు చూస్తామనీ, మత్తళ్లు దుంకుతాయనీ కలలో అయినా అనుకున్నామా అని ప్రశ్నించారు. ఒకప్పుడు నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వొస్తే రోడ్లన్ని గుంతలమయంగా ఉండేవన్నారు. గర్బిణీ స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదన్నారు. గతుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ఏ మండలం అంటే మా మర్కుక్ మండలం అంటారు. తెలంగాణలో ఎవరికి దక్కని గౌరవం మర్కూక్ మండలానికి దక్కిందన్నారు.
మీ సార్‌ది ఊరు అంటే మా ఊరు, మా మర్కూక్ అని, తెలంగాణకు సిఎం ఇచ్చిన ఘనత కూడా గజ్వేల్, మర్కూక్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్ ఉంటే మనకెంతో లాభం జరగుతుందన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వొచ్చాయనీ ఎవరెవరో వొస్తారనీ వారి మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. కులం, చుట్టరికం, మతం అంటూ వచ్చే వారిని నమ్మొద్దన్నారు. ఈ నెల 30 తర్వాత ఎవరూ కూడా ఈ ప్రాంతానికి రారనీ, ఉంటే ఎంపిపి పాండు, కరుణాకర్‌రెడ్డి ఉంటారనీ, ఆపదలో, కష్టంలో ఎవరొచ్చారో, ఎవరు దగ్గరగా ఉన్నారో ఆలోచన చేయాలన్నారు. కష్టంలో లేడు, సుఖంలో లేడు ఎక్కడి నుండి వస్తున్నారనీ, ఎవడో వచ్చి బిడ్డ బిడ్డ అంటే నమ్మితే మోస పోతామన్నారు. కేసీఆర్ కాకుండా ఇంకొకడు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు, అభివృద్ధి ఉండదన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారనీ, ఈసారి కారు గెలవగానే సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నామనీ, ఫించన్‌ను 2వేల నుండి 5వేల రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు. రైతుబంధును కూడా పెంచుతామన్నారు. అసైన్డ్ ల్యాండ్స్‌కి పట్టా ఇచ్చి హక్కులు ఇవ్వబోతున్నామనీ, సిలిండర్ ధరలు పెంచిన బిజెపి వాళ్లనిని ప్రశ్నించాలనీ, కేసీఆర్ మూడోసారి సిఎం కాగానే 400రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామనీ, రైతు బంధు 16 వేలు ఇవ్వబోతున్నామన్నారు.
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా, అరోగ్య శ్రీ కింద 15 లక్షల దాకా వైద్యం, సౌభాగ్య లక్ష్మి 3000 ఇవ్వబోతున్నామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకటో, రెండో సీట్లు వస్తాయనీ, బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే బుద్ది చెప్పాలని పరోక్షంగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌ను లక్ష వోట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు. ఖర్మకాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ వస్తదనీ, 10హెచ్‌పి మోటార్ ఎవరు కొనివ్వాలనీ, టిపిసిసి నేత రేవంత్ రెడ్డికి వ్యవసాయం అంటే తెల్వదన్నారు. అనంతరం బిజెపి పార్టీకి చెందిన పలువురు నేతలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు భూంరెడ్డి, ఎంపిపి పాండుగౌడ్, కరుణాకర్‌రెడ్డి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.



