- జీవితాంతం బిఆర్‌ఎస్‌కు ఊడిగం చేస్తా
- ఏ సబ్ స్టేషన్‌కు వొస్తారో రండి చూద్దాం
- కెటిఆర్ ట్వీట్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా కేటీఆర్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మూడు గంటలు కావాలా…మూడు పంటలు కావాలా‘ అన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు. పది గంటల కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ చూపిస్తే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తా అంటూ ఎంపీ సవాల్ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్‌ఎస్‌కు సేవ చేస్తా అంటూ సవాల్ చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేస్తానన్నారు.
ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నా సవాలుకు ఎవడొస్తారో రండి. కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించండని అంటూ ఎంపీ కోమటిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. కావాలని సత్యగ్రహ దీక్షని భగ్నం చేయడానికి బీఆర్‌ఎస్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్‌ఎస్ అపోహలు సృష్టిస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు బుధవారం రాత్రికి హైదరాబాద్ వొస్తారని..రేపు పీసీసీతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. చిన్న విషయాన్ని..అననిది అన్నట్టుగా బీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో పది గంటలకు మించి కరెంటు రావడం లేదని..దమ్ముంటే బీఆర్‌ఎస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.




