ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ.. ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్నారు. గత ఏడాది దళిత బంధు పథకం ప్రకటించి, లక్షలో ఒక్కరి, ఇద్దరికి ఇచ్చి, దాని ఉసే మరిచారు. గత నెల రోజుల క్రితం అతి గొప్పగా బిసి కుల వృత్తులకు రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకానీ ప్రకటించారు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకాని కేసీఆర్ పునాదులు వేశాడు. కానీ సంక్షేమ పథకాలు ప్రకటించిన అంత వేగంగా, ఆ పథకాల అమలు లేకపోవడం చూస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పథకాలు అమలు చేయాలన్న చిత్త శుద్ధి ఉందా..? అన్న సందేహం కలుగుతుంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అతి గొప్పగా ప్రకటిస్తూ.. దళితుల్లో ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధి అయిన, ప్రభుత్వ ఉద్యోగైనా, వ్యాపారస్తుడైనా, భూమి ఉన్నా సరే, ప్రతి దళితునికి రూ.10 లక్షల నగదు బంధు ఇస్తానని ప్రకటించారు. అన్న విధంగానే కోటికో నూటికో ఒకరి, ఇద్దరికి తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చి ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారు.
అదే విధంగా ఆగ మేఘాల మీద బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష రూపాయల బంధు ప్రకటించినట్లుగానే, గత రెండు రోజుల క్రితం మైనార్టీలకు మైనార్టీ బంధును కూడా ఇస్తానన్న ప్రకటన రానే వచ్చింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇప్పుడే దళితులు, గిరిజనులు, బిసి, మైనార్టీలు గుర్తుకు రావడంపై అనేక సందేశాలు కలుగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపు మాపడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే, కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తుంది. నిజానికి దళితుల్లో నూటికి 90 శాతంకు పైగా కడు బీదరికంలోనే ఉన్నారు. వారిని బీదరికం నుంచి బైట పడేయటానికి దళిత బంధు తేవడం హర్షణీయమే, కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని చూస్తుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఏ పథకమైన ముందుగా ఎలాంటి అసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహిస్తారు. అందుకు భిన్నంగా దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగస్తులు, తమ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చుకున్నారు.
అంటే ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమతో పెట్టిన పథకం కాదన్న మాట.! ఓట్ల కోసం పెట్టిన పథకం అన్న మాట.! ప్రతి దళితుడికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అపోహలు, సందేహాలు లేవు కానీ, ముందుగా కడు బీదరికంలో ఉండి, ఎలాంటి ఆసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహించాలి. అందరికి ఇస్తాను అని అనడంలోనే కేసీఆర్ చిత్త శుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. అంటే ఒక్కరి, ఇద్దరికి రూ.10 లక్షలు ఇచ్చి, యావత్ దళిత సమాజాన్ని మోసం చేయలని కేసీఆర్ కుట్ర పన్నినట్లుగా ఉంది. ఇదే తరహాలో బిసి కుల వృతి దారులకు, మైనార్టీలకు రూ.లక్ష రూపాయల పథకం ఊరికి ఒక్కరు, ఇద్దరికి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఉంది. గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలు ప్రకటించి, నేడు వాటి ఊసే ఎత్తడం లేదు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి జాబితాలో దళిత, బిసి, మైనార్టీ బంధు పథకాలు చేరుతాయన్న సందేశం కలుగుతుంది.
బిసి బంధు ప్రకటించిన నెల రోజుల తరువాత విధి విధానాలు ప్రకటించి, దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజుల గడువు ఇవ్వడం ఏమిటి..? అంటే ఎవరు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉండకూడదని అనుకున్నారేమో..? అందుకే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజు గడువు ఇచ్చినట్లు ఉన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి దరఖాస్తుదారుడు కుల, ఆదాయ, ధృవ పత్రాలతో పాటు రేషన్ కార్డు జత చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ లేనే లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కుల ధృవీకరణ పత్రం జారికి ఒక నెల గడువు, ఆదాయ ధృవీకరణ పత్రాల జారికి వారం రోజుల గడువు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పది రోజుల గడువులో బిసి కుల వృత్తి దారులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు. బిసి కుల వృత్తులు చేసుకునే వారిలో, మైనార్టీలలో అత్యధికులు నిరక్షరాశులు ఉంటారు. ప్రభుత్వం సూచించిన విధంగా వారం రోజులో ధృవ పత్రాలను పొంది, ఎలా దరఖాస్తు చేసుకుంటారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వానికి బిసి కులాలను మోసం చేయడం కోసమే, బిసి బంధు తెచ్చినట్లు కనిపిస్తుంది.
బిసి బంధు ప్రకటనతో లక్షలాది మంది వారం రోజుల పాటు ఏంఅర్ఓ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన చాలా మంది కుల, ఆదాయ ధృవ పత్రాలు సాధించలేక పోయారు. ఇదే అదునుగా ఏంఅర్ఓ కార్యాలయ సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అందిన కాడికి దండుకొని కావలసిన వారికి ధృవ పత్రాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రకటిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందేలా విధి విధానాలను రూపకల్పన చేస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో చిత్త శుద్ధి లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికే సమయం ఇవ్వని ప్రభుత్వం అర్హులైన బిసి కులాలకు రూ.లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని నమ్మాలి. దళిత బంధు, బిసి కుల వృత్తులకు ఇచ్చే రూ.లక్ష రూపాయల సహాయం పథకం మాదిరిగానే మైనార్టీ బంధు పథకం కూడా ప్రకటనలకే పరిమితం కానున్నట్లు ఉంది. దీనిని బట్టి చూస్తే, కేసీఆర్ మరోసారి ఓట్ల కోసం ఆగ మేఘాల మీద తీసుకువచ్చిన పథకాలు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదన్న సంగతి తేటతెల్లం అవుతున్నది.
బొల్లంపల్లి ఆంజనేయులు
9000099152




