- అణచివేయడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర
- మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖలతో పోస్టులు
- ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్ లో చేరొచ్చు..చాలా దేశాల్లో ఇలాంటి పథకం ఉంది
- విడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : అగ్నిపథ్ పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం సృష్టించాలనే అలజడులు సృష్టించారని మండిపడ్డారు. దేశభక్తి, జాతీయ భావం పెంచే క్రమంలోనే అగ్నిపథ్ తెచ్చామని తెలిపారు. అనేక దేశాల్లో అగ్నిపథ్ లాంటి పథకాలు ఉన్నాయని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల తర్వాత విధిగా దేశ సేవ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశ సేవ చేయాలనుకున్నవారే అగ్నిపథ్‌లో చేరవచ్చన్నారు. ఇది కంపల్సరీ స్కీమ్ కాదని, అగ్నిపథ్ అనేది వాలంటరీ స్కీమ్ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‌పై దేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. అనేక దేశాల విధానాన్ని పరిశీలించాకే అగ్నిపథ్ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దుర్ఘటన దురదృష్టకరం. ఉదయం నుంచి విధ్వంసం సృష్టిస్తుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రైల్వేస్టేషన్ ఘటన ఉద్దేశపూర్వంగా జరిగిందే. ఘటనలో వ్యక్తి మృతి బాధాకరం. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. హింస జరుగుతుంటే రెచ్చగొట్టేలా ఓ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌పై అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వొచ్చినవారంతా ఏమైనా సైన్యంలో చేరేవారా? వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ అమలు చేస్తున్నాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. అగ్నిపథ్ వాలంటరీ స్కీమ్ అని, అందులో చేరేందుకు ఎలాంటి బలవంతం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొంత మంది కుట్రపూరితంగా ఆందోళన చేపట్టారని ఆరోపించారు. స్టేషన్ ప్లాట్ ఫామ్స్, ట్రెయిన్స్, ఇతర ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు. షాపులను లూటీ చేశారని, ఆందోళనకారుల దాడులతో పాసింజర్లు సామాన్లు వొదిలేసి ప్రాణభయంతో పారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాదని, చాలా దురదృష్టకరమని వాపోయారు. స్కీమ్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్దంగా చర్చించాలని మంత్రి సూచించారు.
దేశ రక్షణకు సంబంధించి భారత్ కూడా ఈ స్కీమ్‌ను చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఉదయం నుంచి నిరసనకారులు విధ్వంసం చేస్తోంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు ఈ స్థాయిలో విఘాతం కలుగుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఫైర్ అయ్యారు. ఆందోళనను కట్టడి చేయాల్సిన రాష్ట్ర మంత్రులు…సోషల్ వి•డియాలో పోస్టులు పెడుతూ రెచ్చకొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఆందోళనను ఆపాలని కోరారు. సమగ్రమైన దర్యాప్తు చేసి ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.




