నార్మల్ డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ
డ్యూటీ డాక్టర్ నిర్లక్యంతో పసికందు బలి
ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం
పటాన్చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని కోరినా, డ్యూటీ డాక్టర్లు మాత్రం నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి వైద్యులు విస్తుపోయేలా పసికందు ప్రాణాలను పొట్టన పెట్టుకునేలా డ్యూటీ చేస్తున్నారు. పురిటి నొప్పులతో ప్రభుత్వ హాస్పిటల్‌కి చేరిన గర్భీణీ మహిళకు నార్మల్ డెలివరీ చేయాలనే పట్టుదలతో ఉండి పసిపాప ప్రాణాలను బలితీసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, మహిళా కుటుంబ సభ్యులతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అమీన్ పూర్ మున్సిపాలిటీ లింగమయ్య కాలనీకి చెందిన వినోద అనే గర్భిణీ మహిళ ఈ నెల 11న ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పురిటి నొప్పులతో ఇబ్బంది పడగా, కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. నార్మల్ డెలివరీ చేస్తామంటూ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ శ్రీవాణి చెబుతూ సాయంత్రం 5 గంటల పాటు వెయిట్ చేయించారు. నొప్పులు తీవ్రతరం కావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ మహిళ కోరినా వైద్యులు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు.
పాప తల భాగం వరకు తీసి పరిస్థితి తమ అదుపులో లేదన్న విషయాన్ని పసిగట్టి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కి పంపించారు. సంగారెడ్డిలో డెలివరీ చేయగా పాప పరిస్థితి విషమంగా ఉండడంతో నిలోఫర్ హాస్పిటల్‌కి రెఫర్ చేశారు. అప్పటికే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు నిలోఫర్ వైద్యులు చెప్పారన్నారు. పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప ప్రాణం కోల్పోయిందని బాధిత మహిళ, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ఐదారు రోజులకు వెలుగులోకి రావడంతో బీజేపీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు సి.గోదావరి అంజిరెడ్డి, గడీల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ ఎడ్ల రమేష్ లు మాట్లాడుతూ అన్యాయాలకు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్ మారిందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు.



