పటాన్చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ నుండి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీల ఐక్యత వర్ధిల్లాలి, సబ్బండ వర్గాల నాయకులకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో పాలన కొనసాగిస్తున్నానని చెప్తున్న సీఎం కేసీఆర్ బీసీ వర్గాల నాయకులకు టికెట్ కేటాయింపులో చిన్న చూపు చూడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా వాడుకుంటూ బహుజన వర్గాల నాయకులని తొక్కి పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ కులాలైన ముదిరాజ్ లు, నాయిని బ్రాహ్మ, రజక ఇతర బీసీ కులాల వారికి సీట్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజలందరికీ అండగా ఉంటూ బీఅర్ఎస్ పార్టీని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లిన నీలం మధు ముదిరాజ్ కు టికెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. 60 లక్షల ఓట్లు ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం భావ్యం కాదన్నారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 58 సీట్లు ఇస్తే, బీసీ వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలో మీరే ఆలోచించుకోవాలని హితవు పలికారు. వెంటనే బీఅర్ఎస్ అధిష్టానం పటాన్ చెరు టికెట్ పై పునరాలోచన చేసి, బహుజన నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీలంతా ఏకమై మా సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మన రజక సంఘం ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటేష్, చాకలి సంజీవ్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గారెల శ్రీను ముదిరాజ్, లక్ష్మారెడ్డి, దానయ్య, వడ్డెర వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, గౌరిచారి, మల అనిల్, మురళియాదవ్, సబ్బండ వర్గాల నాయకులు, మద్దతుదారులు, తదితరులు పాల్గొన్నారు.



