పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డు పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనేక రకాలుగా హింసించారన్నారు. ఎంఎంటీఎస్ రైలు విస్తరణలో భాగంగా గూడు కోల్పోయిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బీహెచ్ఈఎల్, ఒడిఎఫ్, బిడిఎల్ వంటి పరిశ్రమలు వచ్చాయని, బీఆర్ఎస్ హయాంలో ఏమి వచ్చాయని ప్రశ్నించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ రుణమాఫీ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, కేసీఆర్ హయాంలో ఒరగబెట్టిందేమి లేదన్నారు. రామచంద్రాపురం పరిధిలో రెండు జీహెచ్ఎంసీ డివిజన్లు ఉన్నప్పటికీ ఒక జీహెచ్ఎంసీ కార్యాలయం కూడా లేదని, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రామచంద్రాపురంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. నవంబర్ 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి పటాన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ప్రతి మహిళకు 2500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణ మాఫీ చేస్తామని, రేషన్ షాపులో 9 రకాల వస్తువులను అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల హామీలను గెలిచిన వంద రోజుల్లో అమలు చేసి తీరుతుందని అన్నారు.  ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, 111 డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు మావీన్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు యాదగిరి, సంగారెడ్డి జిల్లా కన్వినర్ వాజీద్, కెఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *