పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత

పచ్చని అడవులు, పర్యావరణంతోనే మనుగడ
మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం…సమస్యలుంటే స్వేచ్ఛగా చెప్పండి
అటవీ రక్షణ ప్రధాన విధి…అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు
అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ ఉన్నత స్థాయి సమీక్ష
ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ తేనెటీగల కేంద్రం ‘‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’’ను ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత అని,  మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉందని అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, తమది ఉద్యోగుల స్నేహ పూర్వక ప్రభుత్వమని, సమస్యలు ఉంటే ఓపెన్‌గా చెప్పాలని మంత్రి అన్నారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్‌ వేదికగా సోమవారం మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీశాఖపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్‌కు వొచ్చిన మంత్రికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..తమది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వమని, అధికారులు, సిబ్బంది తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకోవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయి అధికారుల చెప్పిన విషయాలను ఓపికగా విన్న మంత్రి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా రోడ్లు, భవనాల శాఖలో పనిచేశారని, ప్రభుత్వ ఉద్యోగుల కష్ట సుఖాలు తనకు తెలుసునని అన్నారు.

అదే సమయంలో ప్రతీ అధికారి కుటుంబంతో సహా పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలన్నారు. అడవుల రక్షణ అనేది అన్నింటికంటే ముఖ్యమైన విధి అని, రానున్న రోజుల్లో అత్యంత సవాల్‌తో కూడిన ఈ బాధ్యతలను అందరూ సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఇటీవల కాగజ్‌ నగర్‌లో పులుల మరణం తనను కలిచివేసిందని, రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరగకూడదని అన్నారు. అడవుల రక్షణపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అటవీ రక్షణ కమిటీల సమావేశాలు క్రమం తప్పుకుండా జరగాలని అన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణ స్థానిక జాతులు చెట్ల విత్తనాలు సేకరించి, మెరుగైన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచటం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయన్నారు. హరితహారం వొచ్చే సీజన్‌పై జిల్లా సమీక్షా సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు, అవసరమైన మెటీరియల్‌ ను సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మిగతా పట్టణ ప్రాంతాలతో పాటు ట్రై సిటీస్‌గా ఖ్యాతిగాంచిన వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట మూడు నగరాల్లో పచ్చదనం పెంపు, పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తామని, అదే సమయంలో చట్ట వ్యతిరేకంగా అడవుల ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అడవుల ఆక్రమణను సహించమని, గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఇతర శాఖల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు.

కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడవులకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న  పోస్టుల భర్తీకి కూడా సత్వర  చర్యలు తీసుకుంటామని అన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్‌ పెట్టేందుకు పోలీస్‌ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో బాగా పనిచేసి అధికారులు, సిబ్బందిని మరింతగా ప్రోత్సహించేందుకు, అవార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్‌ను మంత్రి ఆదేశించారు. వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా, అటవీ శివారుల్లో ‘‘పల్లె పశువుల వనాల’’ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. అడవుల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, అలాగే మంచి ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా ప్రజలకు పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఎకో టూరిజంలో స్థానిక గిరిజనులకు, చెంచులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని అన్నారు. కంపా నిధుల వినియోగం, అడవుల పునరుద్ధరణ, హరితనిధి, పోడు భూములకు పట్టాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల పురోగతి, ఫారెస్ట్‌ కాలేజీ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కేటాయించిన భూముల నోటిఫికేషన్లు తదితర అంశాలను సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి కొండా సురేఖ చర్చించారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్‌, పీసీసీఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఎంసీ. పర్గెయిన్‌, విజిలెన్స్‌ పీసీసీఎఫ్‌ ఏలూసింగ్‌ మేరు, అన్ని జిల్లాలకు చెందిన కన్జర్వేటర్లు, అటవీ అధికారులు హాజరయ్యారు.

ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ తేనెటీగల కేంద్రం ‘‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’’ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్‌(సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్‌ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్‌ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్‌ కాలేజీ అందిస్తున్నది. ఈ సెంటర్‌ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను ‘‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’’ బ్రాండ్‌ పేరుతో ఫారెస్ట్‌ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నది. ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్‌ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియల్‌, ఫారెస్ట్‌ కాలేజీ డీన్‌ ప్రియాంక వర్గీస్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *