నూతన పార్లమెంట్ ను ఆవిష్కరించుకునే సందర్భంలో ప్రభుత్వం ప్రాచీన భారతదేశంలో అనుసరించబడ్డ ‘రాజదండం లేదా ధర్మ దండాన్ని’ ప్రతిక్షేపిస్తున్న విషయం పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.ప్రాచీన వైదిక లేదా హిందూ ధర్మానికి,రక్షణకు ప్రతీకగా ఉండే ఈ ప్రాచీన సెంగోల్ అనే దండం ఇప్పుడు చర్చలోకి వచ్చినప్పటికీ అక్కడక్కడా ఇప్పటికి అమలులో ఉంది.తెలంగాణ లో శ్రీరామ నవమి మరుసటి రోజు సెక్యులర్ రాముడిగా పూజలందుకుంటున్న భద్రాద్రి లో శ్రీ రాముని పట్టాభిషేకము ఇలాంటి రాజదండం తోటే నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి అధికారికంగా గవర్నర్లు సైతం తప్పకుండా హాజరవుతారు.ఇటివల ఇంగ్లాండ్ లో చార్లెస్ 3 పేరు మీదుగా పట్టాభిషేకము చేసుకునే క్రమంలో క్రైస్తవ ధర్మ దండం చేపట్టడం ద్వారా పట్టాభిశక్తుడయ్యాడు.ఇవన్ని నైతికత పేరుతో రాజకీయాలలో మతాన్ని చొప్పించేందుకు వాటి పట్ల మానసిక అంగీకారాన్ని పొందేందుకు ఉపయోగపడేది.
నెహ్రూ నుండి మోదీ దాకా సెంగోల్ బాగోతం
స్వాతంత్ర్యం పొందే సమయానికే భారతదేశంలో ఉత్తరాది,దక్షిణాది పోటీ నెలకొంది.ఈ ద్రవిడ నాడు ఉద్యమ ప్రభావం తో అనేక తమిళ సాంస్కృతిక చిహ్నాలు , భావనలలో కొన్నింటిని యూనియన్ ప్రభుత్వం తప్పనిసరిగా అంగీకరించాల్సి వచ్చింది.దీనితో పాటు అనేక మంది హిందూ మత ప్రభావశీలుల మొదలగు ఇరువురి మనసు గెలుచుకోవడానికి సెంగోల్ అంశం ముందుకు వచ్చింది.అంతే గాక భారతదేశంలో రాజకీయ అంశాలను మత, ఆధ్యాత్మిక ద్రృక్పధంలో నాడు ప్రకటించాల్సిన పరిస్థితులు ఉండటంతో తమ పాలనకు ప్రజల నుంచి మానసిక అంగీకారాన్ని సాధించడానికై అప్పటికి సజీవంగా ఒక క్రతువు గా కంచి పీఠంలో అనుసరిస్తున్న అంశాన్ని రాజాజీ సూచనతో ఆగష్టు 14 న అధికార మార్పిడికి పావుగంట ముందు నెహ్రూ దీనిని స్వీకరించారు.
భారతదేశంలో ధర్మ దండం లేదా రాజధర్మం అంటే అర్థం “కుల ధర్మాన్ని రక్షించడమే”.రాజు పరమావధిగా ప్రాచీన సాహిత్యమంతా పేర్కొంది.ఈ రాజదండాన్ని ప్రజాస్వామీకరించిన వాడు అశోకుడు మాత్రమే.ఆయన ఈ రాజదండాల స్ధానంలో నలుదిక్కులా సాత్విక సింహముఖ గుర్తులను దేశమంతా ప్రతిష్టింపజేసినాడు.దీనినే భారత రాజ్యాంగం స్వీకరించింది.నెహ్రూ అందుకున్న రాజదండం అలహాబాద్ లోను,దిల్లీ లోను మ్యూజియంగా మారిపోయింది.ఇదిలా ఉంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా తమిళ ప్రజలు తమ సెంగోల్ ను తమకు ఆధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు..తమిళ సంఘాలతో పాటు తుగ్లక్ లాంటి పత్రికలు కూడా సెంగోల్ ను అప్పగించాలని డిమాండ్ చేసింది.
మోదీ అధికారాన్ని చేపట్టిన తదనంతరం నెహ్రూ గుర్తులను కాలగర్భంలో కలిపేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.నెహ్రు భారత్ స్ధానంలో మోదీ భారత్ ను నిర్మించదలుచుకున్నరు.ఈ క్రమంలోనే కొత్త పార్లమెంటు రూపొందించబడింది.ఇదే సమయంలో ఇటీవల మరి ప్రభావాన్ని కోల్పోయిన మోదీ కి తమిళ ప్రజల సెంగోల్ అంశాన్ని రాకెట్ వేగంతో తమకు అనుకూలంగా మలుచుకున్నాడు.ప్రాచీన చోళ సమాజ ప్రజాస్వామ్యపు ఎంపిక పద్దతి ఐన
“కూడై వోలై”(స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులను ప్రజలే ఎంపిక చేసుకునే పద్దతి)ని స్వీకరించకుండా మను ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ అంశాన్ని తెర మీదకు తెచ్చి తమ పాలనను 5జి సాఫ్ట్వేర్ లాగా ఇన్ స్టాల్ చేసుకున్నాడు.
రాజాజీ ఆకాంక్ష రెండు ఫెడరేషన్లు.
మూడత్వ ఉత్తరాది ఆధిపత్యం నుంచి హేతుబద్ధమైన పురోగామి దక్షిణాదిని సంరక్షించుకోవాలంటే భారతదేశం నిలదొక్కుకోవాలంటే ఉత్తరాది ఫెడరేషన్, దక్షిణాది ఫెడరేషన్ అను రెండు ఫెడరేషన్లను వేరు వేరుగా ఏర్పాటు చేయాలని,ఆ రెండింటి నుంచి సమ భాగంగా ఎంపిక చేసిన ప్రతినిధులతో ఒక కాన్ఫిడరేషన్ (ఐక్య పార్లమెంటు) ఏర్పాటు చేయాలని రాజాజీ సూచనతో పాటు హెచ్చరిక చేసినాడు.కాని నాడు విలువైన ఆలోచనను ఎవరు పరిగణనలోకి తీసుకోలేదు.నేడు మోదీ, అమిత్ షా లు రాజాజీ జపం చేస్తూ కొత్త ఫాసిస్టు ఫెడరేషన్ ను సెంట్రల్ విస్టా పేరుతో ప్రారంభిస్తున్నారు.అత్యంత ప్రజాస్వామ్య వాది అయిన రాజాజీ ఆలోచనలకు ఇది విరుద్ధం.
కాస్తంతైనా ప్రజాస్వామ్యం పరిడవిల్లింది ఇచ్చోటనే
ట్రస్ట్ విత్ డెస్టినీ తో పవిత్రత చేకూర్చుకున్న పార్లమెంటు రాజ్యాంగ సభ గాను,అద్భుత మేధో మథనం చెందిన,ఈ ప్రదేశం నెహ్రూ, అంబేద్కర్ కృపాలాని,లాల్ బహదూర్, గుల్జారీలాల్ నంద,రావి నారాయణరెడ్డి, కామరాజ్ నాడార్, మొరార్జీ దేశాయ్,మధు దండావతే ,ఇందిరా గాంధీ,ఈశ్వరీబాయి, సోనియా,సుష్మా స్వరాజ్,మీరాకుమార్ మహువా ల వరకు తరించిన నదీ ప్రవాహంలా ఉప్పొంగే వాజ్ పాయ్ ప్రసంగాలు పీవి,రాజీవ్ ల ముందు చూపు,వి పి సింగ్ సాహసోపేత నిర్ణయాలు,జార్జ్ ఫెర్నాండెజ్,రాజ్ నారాయణ్ సింహ నాదాలు,లాలు చమత్కారాలు,పాశ్వాన్ మెజారిటీ ముచ్చట్లు, జైపాల్, శశిథరూర్ ల ఆంగ్ల భాష విన్యాసాలు ప్రొఫెసర్ జా..లోతైన విశ్లేషణలకు నిలయంగా ఉండటంతో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ డిసెంట్ వ్యాఖ్యానాలు,సర్వేపల్లి వేద రూప శబ్దాలు,కే ఆర్ నారాయణన్ ఉన్నత రాజకీయ ప్రసంగాలు,అబ్దుల్ కలాం మానవీయత మొదలగు వాటికి వేదికగా నిలిచిన ఈ పార్లమెంట్ రాజ్యాంగాన్ని ప్రసాదించి ,భూ సంస్కరణల చట్టాలు మొదలు విలువైన భూ సేకరణ చట్టం దాకా చేసిన చట్టాలు వ్యక్తి కంటే సమాజమే ముఖ్యమనే సంక్షేమ చట్టాలు,నియంత స్వభావానికి కళ్ళెం వేసిన చట్టాలు, సమాచార సేకరణ నుంచి ఆహార భద్రత వరకు గ్యారంటీ ఇచ్చిన చట్టాలు ,మనుగడకు విద్యను ప్రమాణం చేసిన చట్టాలతో భారతదేశాన్ని ప్రపంచంలో నే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా రూపొందించినది.
విధ్వంసానికి ఒడిగట్టినవారే సెంట్రల్ విస్టా సృష్ఠికర్తలు
ఈ ప్రజాస్వామ్య దేవాలయంలోకి 2014 లో ప్రజాస్వామ్య మూల విరాట్ ను తొలగించి ఫాసిస్టు దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి.ఈ దేశం కోసమే సమిధలై ఈ దేశ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన మనుషుల ను మతప్రాతిపదికన విడదీసి వారిని పరాయి వారిగా,ద్రోహూలుగా అమానవీయంగా చిత్రీకరించినారు.గుజరాత్ గాయాన్ని సృష్టించిన వారికి స్వాతంత్ర్య ఫలాలు అందించింది వీరే.ఓ పక్క దేశ భక్తి చెపుతూ,మరోపక్క దేశ భద్రతా సమాచారాన్ని శత్రు శిభిరాలకు ఇచ్చేది వీరే.అధాని అంశంలో నోరు మెదపనిది వీరే.దేశ గౌరవాన్ని అంతర్జాతీయ వీధుల్లో బలిపెట్టేది వీరే.ఇట్లాంటి వాటితో పాటుగా అనేక వ్యవస్థ లను తమ భావజాలం తో విధ్వంసం చేసేందుకు తమవారీతోనే ఆ వ్యవస్థ లను పూర్తి స్థాయిలో నింపివేస్తున్నారు.అవి ఈ దేవాలయ వారసత్వాన్ని చిందరవందర చేసి తాము మాత్రమే ఉండగలిగే తమ ఆలోచనలు మాత్రమే చెల్లగలిగే ఇంద్ర ప్రస్థానాన్ని గుజరాత్ రక్త పాతంతో కొవిడ్ వదిలి వెళ్ళిన ఎముకల గూడు నే వజ్రాయుధాలుగా కొత్త గూడును నిర్మించినదే న్యూ సెంట్రల్ విస్టా.
బుల్ బుల్ పిట్ట సిద్దాంతం అమలు కోసమేనా కొత్త పార్లమెంటు
పాత పార్లమెంటు స్వాతంత్ర్యోద్యమ కారులకు,వైవిధ్యతను గౌరవించిన మేధావులకు,సైకిల్ పై వెళ్ళగలిగే వాళ్ళకు పార్లమెంటు వేదిక అయింది.ప్రారంభం కాబోయే కొత్త పార్లమెంటు కార్పోరేట్ శక్తులకు,మత వాదులకు,ఫాసిస్టు శక్తులకు మాత్రమే చోటు దక్కేలా ఉండబోతుందోమో అనే భావన ప్రజల్లో ఉంది.నాస్తికుడిగా ఒక వైపు ఉంటూనే హిందూత్వ సిద్దాంతాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చిన సావర్కర్ కు పరోక్షంగా అంకితం చేయడం కోసమే ప్రారంభ దినాన్ని ఎంచుకున్నారు.పేరుకు మాత్రమే మోదీ .. ఆవిష్కరణ మాత్రం పరివారులదే. మోదీ ,యోగి లు జనసంఘ్ భావ జాలం కంటే హిందూ మహా సభ భావజాలానికే పునీతం అయ్యారు.ఇప్పటికే గుజరాత్ ను కార్పోరేటీకరించిన అహ్మదాబాద్ ఆర్కిటెక్చర్, గుజరాతీ నమూనా నిర్మాణ కర్త బిమల్ పటేల్ సృష్టించిన ఈ కార్పోరేట్ సౌధం శ్రీలంక, బంగ్లాదేశ్,జర్మనీ లోని నూతన పార్లమెంట్ నిర్మాణాలతో కూడా పోటీ పడలేక పోతుంది.పైగా ఓ పక్క మణిపూర్ తగులబెట్టుకుంటా రాజధాని దిల్లీలో ఈ దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన ఆడపిల్లలను చిదుముతున్న తమవారిని రక్షిస్తూ మహోన్నతమైన పార్లమెంట్ పేరుతో ఓ భవనాన్ని ప్రారంబించడం ప్రజాస్వామ్యమా.! ప్రజాస్వామ్యాన్ని బంధించే కార్పోరేట్ కాంక్రీటు సౌధమైన న్యూ విస్టా లో ప్రజాస్వామిక విలవలకు స్థానం ఉంటదా.!
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల