- నగరంలో ఫ్లై ఓవర్ల మూసివేత
- ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : న్యూఇయర్ వేడుకల నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రమాదాలు జరక్కుండా చర్యలకు ఉపక్రమించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ కొనసాగుతుందని ప్రకటించారు. హోటళ్లు, పబ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినయోగం జరక్కుండా నిఘా పెట్టారు. మఫ్టీల్లో అనుసరిస్తున్నారని సమాచారం. ఈవెంట్లకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్.. డ్రగ్స్ పై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నారు. 31న రాత్రి ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో టాస్క్ఫోర్స్ నిఘా పటిష్టం చేసింది. పర్మిషన్ ఇచ్చిన ఈవెంట్ల దగ్గర టాస్క్ఫోర్స్ నిఘా పెంచుతున్నారని సమాచారం.
అయితే వేల సంఖ్యలో పర్మిషన్లు ఇస్తుండడం, ఆ స్థాయిలో సిబ్బందిని నియమించే పరిస్థితి లేదన్న వాదనలు ఉన్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పబ్లు, ఇతర బార్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నది. ఇకపోతే మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. వీలైనంత ఎక్కువ మద్యం అమ్మితేనే ఖజానా నిండుతుంది. ఇందుకోసం డిసెంబర్ 31 నైట్ పార్టీలకు స్పెషల్ పర్మిషన్లు ఇస్తోంది. అర్ధరాత్రి 12 గంటల దాకా వైన్స్ లలో మద్యం అమ్మేందుకు, ఒంటిగంట దాకా బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకే కాకుండా కొత్తగా డిసెంబర్ 31న నైట్ పార్టీలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇస్తోంది. ఇందుకు ఒక్కో ఈవెంట్ కు రూ.12 వేలు వసూలు చేస్తోంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఇప్పటికే దాదాపు 900 ఈవెంట్లకు పర్మిషన్లు ఇచ్చారు.
ఈవెంట్ పర్మిషన్ల ద్వారానే రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా వసూలు కాగలదని భావిస్తున్నారు. మరోవైపు ఈవెంట్లలో లిక్కర్ వినియోగంపైనా వివరాలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.25 వేల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్
ఆదాయం సమకూరిందని సమాచారం. మొత్తంగా పోలీస్ శాఖ నేటినుంచి జనవరి 1 వరకు అప్రమత్తంగా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.ఆ పది పబ్లకు పది తరవాత అనుమతి లేదు : హైకోర్టు ఆదేశం న్యూ ఇయర్ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి పబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పబ్ ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ సాగింది.జూబ్లీహిల్స్లో ఉన్న 10 పబ్లు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 తరువాత సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆర్డర్ నే న్యాయస్థానం సమర్థించింది.




