నేడు కాంగ్రెస్‌ ‘జన జాతర’

తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం
హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకా సహా పలువురు అగ్రనేతలు
అసెంబ్లీ తరహాలో చరిత్ర సృష్టించే లక్ష్యంతో సిఎం రేవంత్‌ ప్రణాళిక
పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చర్యలు

 

image.png

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభిం చిందో.. ఇప్పుడు అదే వేదిక నుంచి జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సర్వం సిద్ధం చేసింది. బిఆర్‌ ఎస్‌, బిజెపిలను తుంగలో తొక్కి తమ ప్రాబల్యం చాటుకోవడంతో పాటు, అత్యధిక పార్లమెంట్‌ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తుంది. వివిధ పథకాలతో ఇప్పటికే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న కాంగ్రెస్‌ శనివారం నాటి తుక్కుగూడ సభతో చరిత్ర సృష్టించాలని చూస్తుంది. జనజాతర సభ మోత మోగిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢంకాబజాయించి చెబు తున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ విజయవంతం చేసేందుకు సిఎంతో సహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం జరిగే సభకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే, వేణుగోపాల్‌ తదితరులు హాజరు కాబోతున్నారు. పార్టీ మేనిఫెస్టోను ఇక్కడే విడుదల చేయబోతున్నారు.

మరోవైపు తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తుంది కాంగ్రెస్‌ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో.. ఇప్పుడు ఈ జనజాతర సభతో చరిత్ర సృష్టించాలని అనుకుటున్నారు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్‌ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో కొంత జాప్యం, ఒడిదుడుకులు, పోటీ చేసే అభ్యర్థులు లేకుండా పోవడం వంటి సమస్యలు ఉన్నా సత్తా చాటాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. పిసిసి చీఫ్‌గా, తెలంగా సిఎంగా ఆయనకు ఇది తొలి పరీక్షగా చెప్పుకోవాలి. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా నేడు శనివారం నాడు హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ నిర్వహించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి అగ్రనేతలు హాజరకానుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో ఉర్పాటు చేసిన జనజాతర బహిరంగ సబ్నకు వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు ఆదిలాబాద్‌ మొదలు ఆలంపూర్‌ వరకు, జహీరాబాద్‌ నుంచి భద్రాచలం వరకు అన్నిగ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం పది లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే సిఎం, మంత్రులు, ముఖ్య నేతలు సభా ప్రాంగణాన్ని పలుమార్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు వారు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు

పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం..
జాతీయ కార్యాచరణ దశ దిశ తుక్కుగూడ నుండే
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌ మున్షీ


 రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో తుక్కుగూడ జన జాతర సభతోనె పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్‌ మున్షి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుక్కుగూడలో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగే జన జాతర సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్‌ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చడం జరుగుతుందని ఆమె అన్నారు. సేవ్‌ ఇండియా, సేవ్‌ రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. దేశ సమగ్రతకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
సోనియా గాంధీ నాయకత్వంలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ పార్టీనేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 70 ఎకరాలలో జరిగే జన జాతర సభకు లక్షలాదిగా తరలివచ్చి కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో సభను విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు. సభకు వొచ్చే ప్రజలకు, కార్యకర్తలకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ సభతోనే దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది పలకడం జరుగుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టే మేనిఫెస్టో కేంద్ర, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివొచ్చి సంఫీుభావం తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎమ్మెల్సీ బి. మహేష్‌ గౌడ్‌, వివేక్‌, రంగారెడ్డి జిల్లా  జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనిత రెడ్డి,ఎం పి రంజిత్‌ రెడ్డి, ఇంచార్జి కే ఎల్‌ ఆర్‌,దేప భాస్కర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మల్‌ రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *