జూనియర్ కాలేజీలకు ముగిసిన సెలవులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : వేసవి సెలవులు ముగియడంతో జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31తో సెలవులు ముగియనున్నాయి.
దీంతో శనివారం నుంచి జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్ కాలేజీల పునఃప్రారంభ తేదీ: జూన్ 1గా నిర్ణయించారు. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 13 వరకు ఉంటాయి. దసరా అనంతరం అక్టోబర్ 13 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. హాప్ ఇయర్ పరీక్షలు: నవంబర్ 18 నుంచి 23 వరకు జరుగుతాయి. సంక్రాంతి సెలవులు జనవరి 11, 2025 నుంచి జనవరి 16 వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 17 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ప్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే జనవరి 20 నుంచి 25 వరకు కొనసాగుతాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో, థియరీ పరీక్షలు మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతాయి. 2024-25 విద్యా సంవత్సరానికి చివరి పని దినం మార్చి 29గా నిర్ణయించారు. వేసవి సెలవులు మార్చి 30 నుంచి జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే చివరి వారంలో ఉంటాయి.





