నేటి నుంచి అసెంబ్లీ పున: సమావేశాలు

  • స్పీకర్‌ ఎన్నికతో తొలి రోజు సమావేశం
  • రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
  • గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : స్పీకర్‌ ఎన్నికతో రాష్ట్ర ఆసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికార పార్టీగా కూర్చోబెట్టిన ప్రజలు.. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలు మారినా ఇరుపార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు తప్పేలా లేవు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నేతలు నిలదీస్తామన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వొచ్చారని హరీష్‌ రావు, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. అయితే శాసన మండలిలో మాత్రం విపక్షాల సభ్యులు ఎక్కువ ఉండటంతో ఆయా అంశాలపై ఎక్కువ సమయం చర్చ జరిగేది. కాని శాసనసభలో మాత్రం ఏకపక్ష చర్చ సాగేది.

2018లోను అదే పరిస్థితి. 2018లోను కాంగ్రెస్‌ ది అదే పరిస్థితి. రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి నేతలు ఆ ఎన్నికల్లో ఓడిపోగా, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌ బాబు వంటి నేతలు కొంత ప్రయత్నించినా అధికార పార్టీని నిలదీసే పరిస్థితి ఏ మాత్రం రాలేదు. మరోవైపు రెండు పర్యాయాలు అసెంబ్లీలో ఎదుటివారిని మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వలేదు. అప్పటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయింది. వామపక్షాలదీ అదే పరిస్థితి. ఈ దఫా 39 సభ్యులతో బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా ఉంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ను దూకుడుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈ దఫా అధికార పార్టీకి అసెంబ్లీలో కొంత ప్రతిఘటన పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. అయితే బిఆర్‌ఎస్‌ అక్రమాలపై సిఎం రేవంత్‌  దులిపే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బయట వారు చేస్తున్న విమర్శలపై గట్టిగానే సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం వ్యవహారం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, డబుల్‌ ఇళ్లు తదితర అంశాలపై ఏమాత్రం చాన్స్‌ తీసుకోకుండా దునుమాడే అవకాశం ఉంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎదుర్కునడం అంత సులువేం కాదు. అయితే  8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌ గా, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, కరీంనగర్‌ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు.

స్పీకర్‌ ఎన్నిక బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చించాల్సిన ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న దానిపై స్పష్టత రానుంది. నేటి సమావేశాల తరవాత రేపు గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ క్రమంలో తరవాత ఒకటి రెండురోజులు మాత్రమే సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీల పథకాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సైతం రాష్ట్రంలో పదేళ్లుగా సాగిన గులాబీ పాలనపైన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైన ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్‌ఎస్‌ ను ఇరుకునపెట్ట వొచ్చని తెలుస్తుంది. అప్పులు చేసిన తీరుపైన, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీఆర్‌ఎస్‌ను కార్నర్‌ చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *