నీరు దేహం దాహాన్ని తీరుస్తుంది!

సాగునీరు జీవితానికి త్రాగునీరు జీవనానికి చాలా అవసరం. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అవసరమైన పదార్థం నీరు. ఈ భూమి పై మొట్టమొదటి జీవం సముద్ర జలాల్లో ఆవిర్భవించింది. ఈ జీవం నుండే ఏకకణ జీవులు, బహుకణ జీవులు ….అలా కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మానవ జాతి ఆవిర్భవించింది. దీని బట్టి జలానికి  జీవులకి దగ్గర సంబంధం ఉందని అంగీకరించాలి. జీవుల మనుగడకు జలమే ఆధారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండోచ్చేమో గానీ , నీరు త్రాగకుండా మనం కొన్ని గంటల వరకు మాత్రమే ఉండగలం. నీరు దేహం దాహం తీర్చుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలికి తాగునీరు చాలా అవసరం. నీరు జీవాన్ని నిలబెడుతుంది.
మంచి నీరు అంటే…
మానవులు త్రాగుటకు అర్హమైన స్వచ్ఛమైన నీరును తాగునీరు లేక మంచినీరు అంటారు. నీరు సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే, బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు మొదలైన వ్యాధికారక కారకాలు, పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాలు, భారీ లోహాలు, నైట్రేట్‌లు, ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌ల వంటి హానికరమైన రసాయన పదార్ధాలు లేకుండా ఉండాలి. స్వచ్ఛమైన త్రాగు నీరు ఎలా ఉండాలంటే లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు, నైట్రేట్‌ వంద మిల్లీగ్రాములకు, విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం 2500 మిల్లీగ్రాములకు,
తలతన్యత 600 మిల్లీగ్రాములుకు మించి ఉండకూడదు.
మంచి నీరు ప్రయోజనాలు
శరీరములో విష తుల్యాలను తొలగిస్తుంది. అన్ని అవయవ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్దక నివారిస్తుంది. జీవనశైలి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మూత్రపిండాలు పనితీరును మెరుగుపరుస్తుంది.
నివేదికలు ఏమి చెబుతున్నాయి
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2021లో 200కోట్లకు పైగా ప్రజలు నీటి ఎద్దడి ఉన్న దేశాలలో నివసిస్తున్నారు. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల ఫలితంగా కొన్ని ప్రాంతాలలో ఇది తీవ్రతరం అవ్వొచ్చు. మెరుగైన మంచి నీటిని ప్రజలకు సరఫరా చేయడం వలన ఆయా దేశాల ఆర్థికవృద్ధి మెరుగు పడుతుంది. 2010లో యు.యన్‌ జనరల్‌ అసెంబ్లీ నీరు, పరిశుభ్రతను మానవ హక్కుగా స్పష్టంగా గుర్తించింది. అటువంటి నీరు ఇప్పుడు కాలుష్యానికి గురవుతుంది. నీరు కాలుష్యం ప్రధానంగా చూస్తే పట్టణీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు, డిటర్జెంట్స్‌, వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు, క్రిమిసంహారక మందులు,  ప్రాచీన సామాజిక పద్దతులు (బహిరంగ మలవిసర్జన, బావులు, చెరువులు, నదులలో బట్టలుతకడం, స్నానం చేయడం వంటివి), ప్లాస్టిక్‌, చెత్త మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం విశ్వ వ్యాప్తంగా 200 కోట్ల ప్రజలు కలుషితమైన నీరు త్రాగుతున్నారు. వీటిలో అనేక వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయి. ఇటువంటి నీరు త్రాగడం వలన టైఫాయిడ్‌, కలరా, అతిసారం, హెపటైటిస్‌, కాలేయ, జీర్ణ సంబంధిత వ్యాధులు, అనేక రకమైన ఇన్ఫెక్షన్లు కలుగుతాయి.  ఇంకా నీటిలో  ఆర్సెనిక్‌, కాడ్మియం, నికెల్‌, పాదరసం, క్రోమియం, జింక్‌ మరియు సీసం వంటి భారలోహాలు ఉంటున్నాయి. త్రాగే నీరు వలన ఇవి మన శరీరం లోనికి ప్రవేశించి మధుమేహం, హృదయ సంబంధిత రుగ్మతలు, న్యూరానల్‌ నష్టం, మూత్రపిండ వైఫల్యాలు, అనేక రకాల క్యాన్సర్లు వస్తాయి. నీటిలో ప్లోరైడ్‌ వలన కాళ్ళు వంకరపోవుట, దంత సమస్యలు వంటి వ్యాధులు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యు.హెచ్‌. ఓ ) నివేదిక ప్రకారం అసురక్షిత నీరు త్రాగడం వలన ప్రతీ యేటా ప్రపంచ వ్యాప్తంగా 4, 85,000 మంది మరణిస్తున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా, కనీసం 170కోట్ల మంది ప్రజలు మలంతో కలుషితమైన తాగునీటిని ఉపయోగిస్తున్నారు. అపరిశుభ్రత కలిగిన నీరు త్రాగడం వలన అతిసార వ్యాధి, తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్లు కలరా, విరేచనాలు, టైఫాయిడ్‌, పోలియో వంటి వ్యాధులను,కలుగజేస్తాయి.  ప్రతి సంవత్సరం సుమారు 5,05,000 అతిసార మరణాలు నమోదవుతున్నాయి. అసురక్షిత తాగునీరు, పారిశుధ్యం మరియు చేతుల పరిశుభ్రత కారణంగా ప్రతి సంవత్సరం పది లక్షల మంది ప్రజలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు.  నీటిలో నివసించే లేదా సంతానోత్పత్తి చేసే కీటకాలు డెంగ్యూ జ్వరం వంటి వ్యాధులను కలిగి ఉంటాయి. వెక్టర్స్‌ అని పిలవబడే ఈ కీటకాలలో కొన్ని, మురికి నీటిలో కాకుండా శుభ్రమైన నీటిలో కూడా సంతానోత్పత్తి చేస్తాయి. గృహ తాగునీటి కంటైనర్లు సంతానోత్పత్తికి ఉపయోగపడతాయి. నీటి నిల్వ కంటైనర్లను కప్పి ఉంచటం వలన వెక్టర్‌ పెంపకాన్ని తగ్గించవచ్చు.

ఇక మన దేశంలో చూస్తే నీతి ఆయోగ్‌ యొక్క కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ (సిడబ్ల్యుఎమ్‌ఐ) నివేదిక 2018 ప్రకారం సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం వలన  మనదేశంలో ప్రతీ యేటా సుమారు   రెండు లక్షల మంది మరణిస్తున్నారని మరియు 2030 సం. నాటికి దేశ జనాభాలో 40 శాతం అనగా 60 కోట్లమంది ప్రజలు త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోబోతారని నివేదించింది. 2024 సం.నాటికి త్రాగునీరు సమస్య ఎదుర్కొంటున్న ప్రజలతో సహా ప్రతి గ్రామీణ గృహానికి తగిన పరిమాణంలో, నిర్ణీత నాణ్యతతో  క్రమమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీటిని సరఫరా చేయబోతారని తెలిపింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నివేదించిన ప్రకారం జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు సంవత్సరాల తరబడి ఆక్రమణల కారణంగా నీటి వనరులు తగ్గిపోతున్నాయి. అలాగే, ప్రధానంగా నగరాలు,పట్టణాల నుండి శుద్ధి చేయని లేదా పాక్షికంగా శుద్ధి చేయబడిన మురుగునీటిని విడుదల చేయడం మరియు వాటి సంబంధిత పరీవాహక ప్రాంతాలలోని పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, ప్రసరణ శుద్ధి కర్మాగారాల నిర్వహణలో సమస్యలు మరియు నిర్వహణలో సమస్యలు, ఉత్పత్తి చేయబడిన మురుగునీటి నిర్వహణకు తగిన మౌలిక సదుపాయాలు లేకపోవటం వలన నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌  ప్రస్తుతం 4294 ప్రదేశాలలో 2026 మానిటరింగ్‌ ప్రదేశాలలో నదులు, 657 ప్రదేశాలలో సరస్సులు, ట్యాంకులు, చెరువులు, నేషనల్‌ వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ ప్రోగ్రామ్‌  కింద ఉపరితల నీరు మరియు భూగర్భ జలాల నీటి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు  కాలుష్య నియంత్రణ కమిటీలు  సహకారంతో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  పునరుజ్జీవనం కోసం 351 కలుషితమైన నదులను గుర్తించింది.

21.03.2024 నాటికి.. జలంజీవన్‌ మిషన్‌ స్థితి
ఆగస్టు, 2019 నుండి భారత ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ (జె.జె.యం)ని అమలు చేస్తోంది. జల్‌ జీవన్‌ మిషన్‌, గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు 2024 నాటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించబడిరది. గ్రే వాటర్‌ మేనేజ్‌మెంట్‌, నీటి సంరక్షణ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ద్వారా రీఛార్జ్‌, పునర్వినియోగం వంటి తప్పనిసరి అంశాలుగా సోర్స్‌ సస్టైనబిలిటీ చర్యలను కూడా ప్రోగ్రామ్‌ అమలు చేస్తుంది. 21.03.24 నాటికి మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య 19,29,77,163. ఇంతవరకు 14,55,41,667 గ్రామీణ గృహ కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.
పరిష్కార మార్గాలు: నీటి కాలుష్యాన్ని చాలా వరకు వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. మురుగు వ్యర్థాలను నీటి వనరులలోకి విడుదల చేయడం కంటే, వాటిని విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం మంచిది. దీన్ని ఆచరించడం వలన ప్రారంభ విషపూరితం తగ్గిపోతుంది మరియు మిగిలిన పదార్ధాలు క్షీణించబడతాయి.చాలా ప్రత్యేకమైన మొక్క వాటర్‌ హైసింత్‌ కాడ్మియం మరియు ఇతర మూలకాల వంటి కరిగిన విష రసాయనాలను గ్రహించగలదు. ఇటువంటి కాలుష్య కారకాలకు గురయ్యే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి. సేంద్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేయాలి.ఇవన్నీ కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయలేవు. ప్రజలు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే మన తరువాత తరం వారికి మేలు చేసే వారమవుతాం.

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *