యుద్ధం… యుద్ధం…
ఉచితాలకీ అభివృద్ధికీ మధ్య యుద్ధం.
ఉచితం బుల్లెట్టయి తూట్లుపొడుస్తుంటే
అనాధలా దీనంగా విలవిల్లాడుతూ రోదిస్తోంది అభివృద్ధి.
వ్యవస్థలు నాశనమౌతున్నా
కొందరు స్వార్థాన్ని త్యజించి రారు.
వారి ఎదలోయలు ఉత్తేజాన్ని నింపుకోలేవు.
ఎన్నో చరితలు, సన్నివేశాలూ సాక్షీభూతమైనా
కొన్ని మస్తిష్కాలు చైతన్యాన్ని నింపుకోలేవు.
స్వార్ధపు ఒంటి స్తంభం మేడలో
‘‘నాకేంటనే’’ గదులు కట్టుకొని
మౌనం తలుపులు బిగించుకొని
ముడుచుకు కూర్చున్న
అసంబద్ధ వ్యక్తిత్వాలకిదే అక్షరపిలుపు.
ఓ మనిషీ !
ఉచితాలనే పాప పంకిలపు కాలుష్య పొగలు
నీ దృష్టిని కమ్మేసాయి.
అభివృద్ధి అనే
పవిత్ర గంగానదీ ప్రవాహం వదలి
ఉచితాల వైతరిణీ వైపే ఎందుకు సాగుతావు?
తాయిలాల మరీచికల మాయలో పడితే
ఎదుగుదలనే మధురఫలాలను ఆస్వాదించలేవు.
భ్రష్ఠుపట్టిపోతున్న వ్యవస్థలో ఉండీ
నాకెందుకంటూ
ఒంటరిదారినే పయనిస్తావెందుకు?
ఒక్కసారి… ఒకే ఒక్కసారి
భవిష్య సమాజపు డొక్కల గురించి
ఆలోచించు.
భయపు అడ్డుగోడలు చేధించి
మౌనతెరలను పటాపంచలు గావించి
ఒంటరితనాన్ని త్యజించి
అన్యాయాలను జయించు.
అధికారమిచ్చిన నీకు ప్రశ్నించే హక్కూ ఉంది.
అధికార కరకు రెక్కల చప్పుడుకు
బెదిరే కుందేలువు కాకు.
ఏమిటీ ధిక్కారమంటావా?
కాదు బ్రతుకు పాఠమంటాను.
కళ్ళముందే సమాజం కూలిపోతోంటే
నిలబెట్టాలనుకోవడం తప్పేమీ కాదులే…
– వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం




