చీకటి మింగేసిన జీవితాల్లో
వెలుతురుకై పోరాటం…
మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం….
అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న
సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం…
అచ్చెరువు గొలిపినా…
ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం.
ఆటుపోట్ల మధ్య జరిగే సంఘర్షణ.
అలజడుల మధ్య ఏర్పడే ఉప్పెన.
అసహాయులకది పెను పోరాటం.
నిత్యం జరిగే జీవన పోరాటం.
నిరాశ ఆవహించిన నిస్సహాయ జీవితాలకు
పగలు,రాత్రి ఒకటే!
పొద్దు పొడిచినా,పొద్దు పోయినా ఒకటే చింత.
అమావాస్య,పౌర్ణమి అన్నీ ఒకటే!ఒకటి వెలుగు…మరొకటి చీకటి అంతే తేడా!
అడుగడుగునా భయం,భద్రత లేని పయనం మధ్య నలుగుతున్న జీవితంలో
ఎక్కడో పెను అలజడి…
హృదయాన్ని నలిపేస్తున్న
ఏదో తెలియని అపశృతి…
జీవిత నావను అగాధంలోకి తోసేస్తున్న అలికిడి…
కంటి ముందు అస్పష్టంగా గోచరిస్తున్న బ్రతుకు ముఖచిత్రం…
తల్లక్రిందులౌతున్న జీవన దృశ్యం…
అయినా చలించని పాషాణ హృదయాల మధ్య ఆకలితో
అలమటిస్తున్న నిర్భాగ్య జీవి దైన్యస్థితి కవి కలానికి బరువుగా…కథకు ఆవేదనగా మారింది!!
అంతులేని యథార్థ జీవిత ఇతివృత్తాలు దృశ్య,శ్రవణ సాధనాలకు కొన్ని దినాలు ఆహారం….అంతే! నిర్భాగ్య జీవి కథ రోజూ ఇంతే!!
కన్నీటి జలపాతం కర్కశ లోకం కంటికి కనిపించదు.
హృదయం లోతుల్లో ఎగసి పడే ఉప్పెన దయలేని హృదయాల దరిచేరదు.
ప్రాణం పోతున్నా చలనం లేని లోకాన్ని బేలగా చూసి,
మానవత్వం నిట్టూర్పు విడిచింది!
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463.




