నిస్సంతులు

పురిటి గడ్డపై
తడియారిన పక్షులు
ఒడిలిన ఈ శరీరాలను
వదిలి ఎగిరిపోయాక
బంధాల పురికొసలు
సుదూర తీరాల నుండి
చరవాణిలో మాట్లాడుతుంటే….

వినికిడికి నోచుకోని చెవులు శ్రోతలయ్యాయి.
కంటి చూపుకు నోచుకోని తెల్ల రెప్పలు మానవ సంబంధానికి దూరమయ్యాయి.

ఎదిగే పిల్లలు..
ఎదురు చూసే రైలు ఎప్పటికోగాని రావు.
ఊదినా నిండని ఆశ
ప్రమిదలో ఇగురుతున్న నూనెలో ఎగసిపడే దీపం లాంటిది.

ఎన్నిసార్లు పిలిచినా రాని మీ కోసం
మోడైన ఈ ముసలి చెట్లు చూసి చూసి శ్వాస జారవిడుచుకోవడమే…

తిరిగే కాలచక్రపు ఏళ్లతో వయసు మీద పడ్డ ఈ గాజు బొమ్మలు పగిలితే ఏరికుట్ట లేరు..

వృద్ధాప్యంలో ఈ వెలుతురు సోకని చెట్లను నిరాదరణ అనే ఎడబాటు కత్తితో నరికేయకండి
ఏ ఆత్మీయతా సుమాలు పూయని చీకటి గదిలో చిట్లిపోయిన మనసులతో వేలాడుతున్నాము

పిల్లల్లేని దంపతులు
రోడ్డు మీద నడుస్తున్నారు

పిల్లలున్న పండుటాకులు
వేడి గాడుపు తగిలి ఎండిన కొమ్మల్లా విరిగిపోతున్నారు.

బలం లేని ఈ భుజాలు అరిగాక మీరు వచ్చినా…
మా నీడలు తలుపులు మూసిన ఈ గోడల మధ్య ఒరిగిపోయుంటాయి.
– పొత్తూరి సీతారామరాజు, 9948849607

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *