నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
యూపిపిస్సీ తరహాలో నియామకాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్రంతో నిరుద్యోగులకు రేవంత్‌  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ మేరకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. ఇకపై ఏటా జనవరి 1వ తేదీన టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీఎస్పీయస్సీ గ్రూప్‌`1, 2, 3, 4లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటనలు వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనుంది. ప్రభుత్వం అనుమతి వొచ్చిన వెంటనే.. ఈ ఏడాది నుంచే జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన తరువాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు. ఏయే నెలల్లో పరీక్షలు జరుగుతాయి. నియామక పక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. జాబ్‌ క్యాలెండర్‌లో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా నియామకాలు పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీసుకుంటుంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతోపాటు, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వస్తే.. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్యఆరోగ్య నియామక బోర్డుల నుంచి యేటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *