నియోజకవర్గ సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాజ్యాధికారంతోనే తమ జాతులకు న్యాయం జరుగుతుందని సబ్బండ వర్గాల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు  మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.గత వారం జిన్నారం మండల కేంద్రంలో మొదలైన రిలే నిరాహార దీక్షలు వరుసగా కొనసాగుతుండగా ఇప్పుడు గుమ్మడిదల మండల కేంద్రంలో నీలం మధు కు మద్దతుగా సబ్బండ వర్గాలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపులలో బీసీలను విస్మరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గనికి ఒక్క టికెట్ కేటాయించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు, తక్షణమే ముదిరాజులకు ఐదు అసెంబ్లీ సీట్లు, ముదిరాజ్ కార్పొరేషన్ కేటాయించాలని  తెలిపారు. పటాన్ చెరు లో అత్యధిక ఓటర్లున్న బిసి సామాజిక వర్గానికి పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.గత నాలుగు సంవత్సరాలుగా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు కు టికెట్ నిరాకరించడం సరికాదన్నారు.మహిళా బిల్లు ఓబిసి బిల్లు కోసం మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ మాటలను తాము స్వాగతిస్తున్నామని అయితే స్వరాష్ట్రంలో టికెట్ల కేటాయింపులో బీసీలకు మహిళలకు మొండి చేయి చూపుతూ టికెట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా పునరాలోచించుకొని బీసీ వర్గాలకు  టికెట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు.ముఖ్యంగా పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ బహుజన నాయకుడు నీలం మధు ముదిరాజ్ కి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామంతా ఏకమై నీలం మధు ముదిరాజ్ పై ఒత్తిడి తెచ్చి సబండ వర్గాల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్యారెల మల్లేష్,గోపాల్,తుడుం శ్రీను, నాగరాజు,నర్సింలు, బిక్షపతి రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, అన్వర్, శంకరయ్య,అశోక్, సురేష్,శేఖర్,మల్లేష్,ప్రకాష్, సబ్బండ వర్గాలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *