- భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పట్టు
భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని విధాలుగా మోసం చేసారని సోమవారం నాడు భద్రాచలం పోలీస్ స్టేషన్లో స్థానిక ఎంఎల్ఏ పొదెం వీరయ్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఇచ్చిన ఫిర్యాదును తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలని పోలీస్ అధికారులను ఆయన డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలను, శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని వందకోట్లతో అభివృద్ధి చేస్తానని మొదటిసారి కల్యాణానికి వొచ్చిన ము్య•మంత్రి కేసీఆర్ హామి ఇచ్చారని, ఆ హామీని నేటివరకు నెరవేర్చలేదని విమర్శించారు.
అలాగే గత ఏడాది వరద సమయంలో బాధితులను పరామర్శించేందుకు వొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మాణం కరకట్ట ఎత్తు పెంచటం వంటి హామీలు ఇచ్చి వెయ్యికోట్లు విడుదల చేస్తున్నామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఇప్పటి వరకు వంద రూపాయల మేర కూడ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలతోనే ము్య•మంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేసారని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గంపైనే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. ఇటీవల పినపాక నియోజకవర్గానికి వందకోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. తాను శాసన సభ్యునిగా అసెంబ్లీలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన పంట భూములు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరినప్పటికి ఆ చెల్లింపులోను సవతి తల్లి ప్రేమ చూపెట్టారని విమర్శించారు.
భద్రాచలం నియోజకవర్గంలో ఈ పది సంవత్సరాలలో 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడ కట్టివ్వలేదని అన్నారు. దళితబంధు పథకం విషయంలోను దళితులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ 7 నెలలు తిప్పుకుని ఇబ్బందులకు గురి చేసారని విమర్శించారు. అనంతరం తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ..కేసీఆర్ అబద్ధపు హామీలతో తాను జవాబుదారిగా ఉండవలసి వొస్తుందనేదే పార్టీ మారటానికి ము్య• కారణమని తెలిపారు. ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, బోగాల శ్రీనివాస్ రెడ్డి, అడబాల వెంకటేశ్వర్లు, వసంతాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.




