నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం

గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌
‌పశ్చిమబెంగాల్‌లో బిజెపి సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌
‌బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడా ముఖ్యమంత్రిని ఓడించాలంటున్న ఈటల

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 9 : ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక కథనం నిజమైంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట అంటే గత ఏడాది డిసెంబర్‌ 23‌న ‘గజ్వేల్‌లో పశ్చిమబెంగాల్‌ ‌తరహా ఫార్మూలా’? సిఎం కేసీఆర్‌పై ఈటల పోటీ? అంటూ శీర్షికన ప్రముఖంగా వార్తను ప్రచురించింది. ‘ప్రజాతంత్ర’ ప్రచురించినట్లుగానే…రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ ‌నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ‌శాసనసభ్యుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌శనివారం హైదరాబాద్‌లో మీడియా నిర్వహించి ఇష్టాగోష్టిలో వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో బిజెపి నేత సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ అవుతుందన్నారు. బెంగాల్‌ ‌మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని చెప్పారు. ఇదే విషయమై ‘ప్రజాతంత్ర’ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు, ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నిలబెట్టేందుకు నియోజకవర్గంపైన ఫోకస్‌ ‌చేస్తున్నట్లు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసిన సిఎం కేసీఆర్‌పై ప్రతీకారం తీసుకోవడానికి మాత్రమే హైకమాండ్‌ ఆదేశిస్తే సిఎం కేసీఆర్‌పైన పోటీ చేస్తాననీ రాజేందర్‌ ‌మాట్లాడి ఉండొచ్చనీ అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ వర్గాలు, రాజేందర్‌ ‌సన్నిహితుల నుంచి అందిన సమాచారం మేరకు‘ప్రజాతంత్ర’ మాత్రం గజ్వేల్‌పై బిజెపి అధిష్టానం కాస్తా సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు కథనంలో పేర్కొంది. రాజేందర్‌ ‌క్యాజువల్‌గా మాట్లాడలేదనీ, సీరియస్‌గానే మాట్లాడినట్లు…ఆయనతో బిజెపి హైకమాండ్‌ ‌కావాలనే అలా మాట్లాడించినట్లు ఆనాడే ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ప్రజాతంత్ర’ ప్రచురించినట్లుగానే శనివారం ఈటల రాజేందర్‌ ‌మీడియాతో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌ ‌తరహా ఫార్మూలాను గజ్వేల్‌లో అమలు చేయనున్నట్లు బాంబు పేల్చాడు.

నా ప్రస్థానం మొదలైందే గజ్వేల్‌ ‌నుంచి… కేసీఆర్‌పైనే నా పోటీ
బిజెపి నాయకుడు, ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ… తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానానికి పోటీ గురించి ముందే చెప్పినట్లు వెల్లడించారు. ఇందుకోసం గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సీరియస్‌గా వర్క్ ‌చేస్తున్నానన్నారు. తెలంగాణలో సిఎం కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో భాజపా సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ అవుతుందన్నారు. బెంగాల్‌ ‌మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని చెప్పారు. తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే ఈగోలు పక్కనబెట్టి లక్ష్యం కోసం పనిచేయాలన్నారు. నా ప్రస్తానం మెదలైందే గజ్వేల్‌ ‌నుంచి, అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్‌ ‌మాత్రమే మాకు కన్పించాలన్నారు.

ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉంటోందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా వోటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. టిఆర్‌ఎస్‌ ‌గ్రాఫ్‌ ‌జారుడు బండ మాదిరి పడిపోతోందన్నారు. బిజెపికి చెందిన నలుగురు కార్పోరేటర్లను టిఆర్‌ఆర్‌ ‌చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా?టిఆర్‌ఎస్‌పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని ఈటల స్పష్టం చేశారు. బిజెపిలోకి భారీ చేరికలుంటాయని, చేరికల కోసం సీక్రెట్‌ ఆపరేషన్‌ ‌నడుస్తోందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఖాళీ అవుతుందని, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్‌ ‌పడిపోయిందని ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. అసలు కేసీఆర్‌ ‌కే టికెట్‌ ‌కట్‌ ‌చేయాలన్నారు. ఇప్పుడు రాజేందర్‌ ‌వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *