నిండుగర్భిణి మృతి

 -తట్టుకోలేక భర్త ఆత్మహత్య
-శోకసంద్రంలో కుటుంబం
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు18: సంతానం కలగాలని ఐవీఎఫ్‌  ‌చికిత్స తీసుకుని, కవల పిల్లల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ దంపతుల జీవితం, కొద్ది గంటల్లోనే విషాదాంతమైంది. కడుపులోనే కవలలు కన్నుమూయడంతో ఆ షాక్‌కు తట్టుకోలేక నిండు గర్భిణి అయిన భార్య కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే ప్రేమగా చూసుకున్న భార్య, కలలుగన్న కవలలు కనుమరుగు కావడంతో ముత్యాల విజయ్‌ అనే యువకుడి గుండె పగిలిపోయింది. శోకసంద్రంలో మునిగిన ఆ భర్త తన జీవితం ఇక శూన్యమని భావించి, శంషాబాద్‌లోని తమ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన ఆ ప్రాంతాన్ని కన్నీటిలో ముంచేసింది. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్‌ (40), అతని భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర కిందట శంషాబాద్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. విజయ్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. సంతానం లేని ఈ దంపతులు ఐవీఎఫ్‌ ‌చికిత్స తీసుకోవడంతో భార్య గర్భం దాల్చారు. అందులోనూ కవలలు పెరుగుతున్నారని తెలియడంతో వారి ఆనందానికి అవధులు లేవు. దాదాపు ఎనిమిది నెలల గర్భిణి అయిన శ్రావ్యతో ఆ ఇల్లు సంతోషంతో నిండిపోయింది. కవలల రాక కోసం ఇద్దరూ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అయితే, 16వ తేదీ రాత్రి, శ్రావ్యకు అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అత్తాపూర్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం ఆ దంపతులకు పిడుగుపాటు లాంటిది. గర్భంలో పెరుగుతున్న కవలలు ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.  ఈ వార్త తెలుసుకుని తట్టుకోలేక శ్రావ్య అక్కడే స్పృహ కోల్పోయింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే శ్రావ్య తుదిశ్వాస విడిచింది. ప్రేమగా చూసుకున్న భార్య, కలలుగన్న కవలలు కొద్ది గంటల వ్యవధిలోనే దూరమవడంతో భర్త ముత్యాల విజయ్‌ ‌పూర్తిగా కుంగిపోయాడు. తన జీవితాన్ని ముందుకు నడపడానికి ఉద్దేశించిన నాలుగు ప్రాణాలు కళ్లముందే కనుమరుగు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ తీరని బాధతో శంషాబాద్‌లోని తమ ఇంట్లోనే విజయ్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దంపతు  మృతితో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page