నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున మరో మహిళ  లావణ్య మృతి చెందింది. దీంతో ఇప్పటి వరకు నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మమత(25), షుష్మ(26) మృతిచెందగా..మంగళవారం అర్ధరాత్రి  మాడుగుల మండలం కొలుకులపల్లి అనుబంధ గ్రామం రాజీవ్‌నగర్‌ ‌తండాకు చెందిన మేరావత్‌ ‌మౌనిక(25), మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీమ్‌పట్నం మండలం సీతారాంపేట్‌ ‌గ్రామానికి చెందిన అవుతపురం లావణ్య(25) మృతి చెందారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో  ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంఎన్‌విలో చికిత్స అందిస్తున్నారు. అటు ఇవాళ ఉదయం చనిపోయిన లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్కార్‌ ‌తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టమ్‌ ‌నివేదిక వొచ్చిన తరవాతనే మరణాలకు కారణాలు తెలుస్తాయని వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీ‌నివాసరావు వెల్లడించారు. ఈ నెల 25న ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో 34 మంది మహిళలకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ‌చేశారు.

ఇందులో కొంతమంది మహిళలు తీవ్రమైన గ్యాస్టోఎంటరైటిస్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స పొందుతున్న వారిలో మొన్న ఇద్దరు, నిన్న ఒకరు, ఇవాళ మరొకరు మృతి చెందారు. వరుస మరణాలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ‌చేయించుకున్న మహిళలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వివరణ ఇస్తూ..34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని, దురదుష్టశావత్తు నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయిస్తుందని చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతుందన్నారు. వారం రోజుల్లో దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులు కూడా దర్యాప్తులో చాలా కీలకమన్నారు.

ప్రస్తుతం 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణపాయం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ‌రెగ్యూలర్‌ ‌గా జరిగే పక్రియని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఆపరేషన్స్ ‌జరుగుతుంటాయని చెప్పారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ ‌గ్రేషియా, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌టిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అంతేకాకుండా చనిపోయిన మహిళల పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై మూడ్రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వొచ్చాయి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటున్న బాధిత బంధువులు ఆందోళనలకు దిగారు. వైద్యులను తక్షణమే సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *