హైదరాబాద్, హైదరాబాద్, సెప్టెంబర్ 5 : హైదరాబాద్ నగరంలో నాలాలు మృత్యుకూపాలుగా మారిపోయాయి. చినుకు పడితే చాలు..రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఏది రహదారియో, ఏది నాలాయో తెలియని పరిస్థితి. అడుగుపెడితే..అథఃపాతాలానికి పడిపోవడం ఖాయం. నిన్న గాంధీనగర్, ఇవాళ ప్రగతినగర్..నగరంలో మ్యాన్‌హోల్స్, నాలాలు యమద్వారానికి మార్గాలుగా మారాయి. వర్షం పడితే చాలు..ప్రతియేటా ఇదే పరిస్థితి. ఇంతకీ లోపం ఎక్కడుంది..? వర్షాలు వొచ్చినప్పుడు నీళ్లు పోవడం కోసం నాలాలు ఓపెన్ చేసి, అక్కడ సైన్‌బోర్డులు పెట్టకపోవడం మున్సిపాల్టీ అధికారుల నిర్లక్ష్యమేనా..? అనే విమర్శలు వొస్తున్నాయి. ప్రగతినగర్ నాలాలో గల్లంతైన బాలుడు మిథున్ (4) మృతిచెందాడు. దాదాపు ఏడు గంటల రెస్క్యూ అనంతరం బాలుడి మృతదేహాన్ని తుర్క చెరువులో గుర్తించారు.
నిజాంపేట మున్సిపాలిటీ ప్రగతినగర్ ఎన్నారై కాలనీలో అప్పటివరకూ భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కాస్తా.. తెరిపి ఇవ్వగానే బాలుడు మిథున్ బయటకొచ్చాచేశాడు. తల్లిదండ్రులు కూడా వర్షం లేదు కదా..అని వదిలేశారు. వర్షం లేకున్నా..రోడ్లపై నీరు నిలిచి ఉంటుంది, నాలాలు తెరిచి ఉంటాయి కదా అని ఆ నాలుగేళ్ల బాలుడికి తెలియదు. దాంతో ఎప్పటిలాగే ఆడుకుంటూ మిథున్ ముందుకెళ్లాడు. అక్కడే మృత్యుకుహరం ఉంటుందని తెలియని ఆ బాలుడు పాతాళానికి పడిపోయాడు. వర్షపునీరు పోవడానికి మ్యాన్‌హోల్ తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బంది, ఎప్పటిలాగే సైన్ బోర్డు పెట్టడం మరిచిపోయారు.
వెరసి..ఓ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటివరకూ ఇంటిముందు అల్లారు ముద్దుగా తమ కళ్ల ముందు ఆడుకున్న మిథున్.. ఇక లేడన్న విషయం మరిచిపోలేకపోతున్నారు ఆ తల్లిదండ్రులు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. మిథున్..మిథున్ అంటూ తల్లి రోదిస్తున్న తీరు, కాలనీవాసులను కలిచివేసింది. బాలుడు తిరిగిరాడన్న చేదునిజాన్ని పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బాలుడి మృతదేహాన్ని గుర్తించి పట్టుకునే సమయంలో ప్రవాహానికి ముందుకు కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.




