ఎన్నో అభివృద్ధి పనులకు ఆర్థిక తోడ్పాటు
గోదాంల నిర్మాణంతో ధాన్యం నిల్వకు అవకాశం
నాబార్డ్ సమావేశంలో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అవి•ర్‌పేటలో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023-24 నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ అవిష్కరించినందుకు అభినందనలు తెలిపారు. నాబార్డు అందిస్తున్న సహకారంతోనే ఎంతో వృద్ధి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. గోదాముల నిర్మాణం, చెరువుల పూడికతీత కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగ పడిందన్నారు. సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశంలో ఆయిల్ పామ్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్నామని..ఆయిల్ పామ్‌కు నాబార్డు సహకారం కావాలని కోరారు.
ఆయిల్ పామ్‌తో రైతులకు మంచి ఆదాయం వొస్తుందని, 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. రైతులు ఈ పంటను సాగు చేసేలా ప్రోత్సహించాలని కోరారు. వరిసాగు రాష్ట్రంలో భారీగా పెరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలు వొచ్చి ఇక్కడ నాట్లు వేస్తున్నారన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేశామని, పారిశ్రామిక వేత్తలకు భూములు ఇస్తున్నామని, దీంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు నాబార్డు ప్రోత్సహం అందించాలన్నారు. సీఎస్ సోమేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో గోదాంల నిర్మాణానికి నాబార్డు అండగా నిలిచిందని, దాంతో రాష్ట్రంలో గోదాముల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గోదాముల నిర్మాణంతో రెండుకోట్ల టన్నుల వరిధాన్యం నిల్వ చేయడంతో పాటు మందుబస్తాలను నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాబార్డుతో కలిసి పని చేశామని, మంచి పలితాలు వొచ్చాయన్నారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ రైతులకు సబ్సిడీని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 46వేల చెరువులు ఉన్నాయని, 46వేల చెరువుల కింద 26 లక్షల ఎకరాల సాగు అయ్యేది కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో 9 లక్షల ఎకరాలకు పడిపోయిందని, రాష్ట్రం వొచ్చాక మళ్ళీ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ అనేక పథకాలను ఇవాళ కేంద్రం కాపీ కొడుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో అనేక అద్భుతాలు చూశామని, రైతులకు నేరుగా డబ్బులు ఇచ్చే పథకం రైతుబంధు అమలు చేస్తున్నది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
ఈ నెల 28 నుంచి పదో విడుతలో రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు చెప్పారు. కొరోనా వొచ్చిన సమయంలో జీతాలు ఆపినా రైతుబంధు మాత్రం ఆపలేదన్నారు. ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని, తద్వారా ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. జీఎస్ డీపీలో వ్యవసాయంరంగం వాటా 19శాతమని, రాష్ట్ర వ్యవసాయ వృద్ధి రేటు 10శాతం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ వృద్ధి రేటు 3శాతమేనని అన్నారు.




