నాంపల్లి బజారఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

  • 9 మంది దుర్మరణం…8 మందికి తీవ్ర గాయాలు
  • చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు
  • ఒకటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వాళ్లే మృత్యువాత
  • ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లిలోని బజారఘాట్‌ ఏరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా..మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక నాలుగు రోజుల పసికందు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అపార్టుమెంటు ముందు పార్క్ ‌చేసి ఉన్న ఒక కారు, ఆరు ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి.

ప్రమాదం జరగగానే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ‌చేపట్టారు. ఫైర్‌ ‌సిబ్బంది నాలుగు ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. అపార్టుమెంటులో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అపార్టుమెంట్‌ ‌గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్‌ ‌చేస్తుండగా మంటలు చెలరేగాయని మధ్యమండల డీసీపీ వేంకటేశ్వర్‌రావు తెలిపారు. గ్యారేజీ సవి•పంలో డీజిల్‌, ‌కెమికల్‌ ‌డ్రమ్ములకు మంటలు అంటుకుని అపార్టుమెంటు పై అంతస్థులకు వ్యాపించాయని చెప్పారు. అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్‌లలో అద్దెకు ఉండే కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నాయన్నారు. కాగా, అపార్టుమెంటు ఓనర్‌ ‌రమేశ్‌ ‌జైశ్వాల్‌కు కెమికల్‌ ‌కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో అపార్టుమెంటు సెల్లార్‌లో అతను 130 డ్రమ్ముల కెమికల్‌ను నిలువచేశారు. పాస్టిక్‌ ‌తయారీకి వినియోగించే ఈ కెమికల్‌ ‌డ్రమ్ముల్లో 30 డ్రమ్ములకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆలోపే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూనే కాలిపోకుండా ఉన్న మిగతా డ్రమ్ములను బయటకు తీసుకొచ్చారు. కాగా, ప్రమాదం అనంతరం ఆపార్టుమెంటు ఓనర్‌ ‌రమేశ్‌ ‌జైశ్వాల్‌ ‌పరారయ్యాడు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒకటి, రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత
నాంపల్లి బాజార్‌ఘాట్‌లోని అపార్టుమెంటులో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి కారకుడిగా భవన యజమాని రమేష్‌ ‌జైస్వాల్‌ను గుర్తించారు. ఐదు అంతస్తుల భవనంలో రమేష్‌ ‌జస్వాల్‌ ‌భారీగా కెమికల్‌ ‌డబ్బాలు నిల్వచేశారు. రమేష్‌ ‌జైస్వాల్‌కి ప్లాస్టిక్‌ ‌తయారు చేసే ఇండస్ట్రీ ఉన్నట్లుగా గుర్తించారు. గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున కెమికల్స్ ‌నిల్వచేయడం జరిగింది. 150 పైగా కెమికల్‌ ‌డబ్బాలను రమేష్‌ ‌జైస్వాల్‌ ‌నిల్వ చేయడం జరిగింది. గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో ఉన్న కెమికల్‌ ‌డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

కెమికల్‌ ‌డబ్బాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా భవనమంతా మంటలు వ్యాపించాయి. ఒకటి, రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. మూడు నాలుగు అంతస్తుల్లో ఉన్నవాళ్లుసేఫ్‌గా ఉన్నారని పోలీసులు తెలిపారు. మూడు నాలుగు అంతస్తుల్లోని వారిని రక్షించారు. మృతుల్లో దట్టమైన పొగలతో ఊపిరాడక చనిపోయిన వారు కొందరైతే.. సజీవదహనమైన వారు మరికొందరున్నారు. చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు సమాచారం. భవనంలో డీజిల్‌, ‌పెట్రోల్‌ ఆయిల్‌ ‌లేదని పోలీసులు తెలిపారు. మంటలకు కెమికల్‌ ‌డబ్బాలే కారణమని పోలీసులు తేల్చారు.

వివరాలను వి•డియాకు వివరించిన ఫైర్‌మాన్‌ ఆదర్శ్
‌బజార్‌ఘా• అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్‌ ఆదర్శ్ ‌వి•డియాకు వివరిస్తూ…నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వొచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారిని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. తమ చేతులతో 21 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్‌కు తరలించినట్లు ఫైర్‌ ‌మాన్‌ ‌వెల్లడించారు. రెండో అంతస్థులో ఉన్న ఆరు మంది పొగపీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లారని…లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారన్నారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని.. వెంటనే హాస్పిటల్‌కి తరలించినట్లు తెలిపారు.

తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా ఉన్నాయన్నారు. ఆ పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారన్నారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామని..కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయాయని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ ‌పూర్తయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని ఆదర్శ్ ‌వెల్లడించారు.

ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌  ‌ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌ఘటనా స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గాయపడిన క్షతగాత్రులకు ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామన్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి
నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్య్రాంతి వ్యక్తం చేశారు. నాంపల్లి బజార్‌ ‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే నాంపల్లి అగ్నిప్రమాద ఘటనను సందర్శించడానికి వొచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ ‌ఖాన్‌ను ఎంఐఎం(ఓఎఓ) కార్యకర్తలు అడ్డుకోవడాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *