ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : నాంపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు ముదిరాజులకు అవకాశం కల్పించాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నేత కోమల రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో వున్న ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో సముచిత స్థానాలు కేటాయించాలన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు ప్రకటించిన 115 స్థానాలలో ముదిరాజ్ అభ్యర్థులు లేరని, దీన్ని దృష్టిలోపెట్టుకొని ప్రకటించని నాలుగు స్థానాలను ముదిరాజులకు కేటాయించాలని కోమల రవి విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ లు ప్రతి ఎన్నికల్లో బిఆరెఎస్ పార్టీని గెలిపిస్తున్నారన్నారు. ప్రతిసారి ముదిరాజ్ లకు అన్యాయం జరుగుతుందాన్నారు. ముదిరాజ్ లకు న్యాయం జరగాలంటే నాంపల్లి నియోజగవర్గాన్ని ముదిరాజ్ లకు కేటాయించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనకు ఈ స్థానాన్ని కేటాయించాలని రవి ముదిరాజ్ విన్నవించారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 2001 నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఈ సమావేశంలో శాంతి ప్రియ ముదిరాజ్, అనినాష్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, వినోద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




