నవ్వడం మరచిపోయాడు!

మోయలేని అధికారభారం
నెత్తి మీద కూలపడ్డట్టు!
నరానికి వత్తిడినలత కల్గి
మోము కండరం పట్టేసినట్టు!

అదుపు కాని ఉద్యోగ భారమో?
వినయం లేని దర్పపు రోగమో?
అరువు తెచ్చుకున్న
గంభీరత ముసుగో !
అలుసు అవుతానని
భీతిల్లిన నెమ్మది సోగసో!

దరహాసానికి అలక వచ్చి
మతిని కోల్పోయిందో?
పరిహాసానికి పాలన వచ్చి
మనసు కలుషితమైందో?

యోగత్వానికి సున్నా చుట్టి
రోగత్వానికి  పట్టంకట్టి!

నరునికి దక్కిన నవ్వుల వరాన్ని
కాల దన్నిన నికృష్ట చలనంలో!
మనిషిని కానని ఏడుపు జబ్బుని
కౌగిలించుకున్న పాపిష్టి గమనంతో!

పాపం…….వాడు
మతి తప్పి జీవనంలో
నవ్వడం మరచిపోయాడు!
గతితప్పి జీవితంలో
జీవించడం మరచిపోయాడు!

– ఉషారం, (నవ్వును మరచిపోయిన
అధికారులు అందరికీ అంకితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *