నవ్యత వైపు నడక…

కొత్త వెలుగు వైపు ప్రయాణించడమే కవిత్వ లక్ష్యం. పాతను తుడిచి నవ్యమార్గం వైపు జాగ్రత్తగా వేసే ప్రతి అడుగూ అందరినీ ఆలోచింపజేస్తుంది. రసాత్మక భావ సమ్మేళనం జీవనమూలాలను స్పర్శిస్తూ సామాజికతను అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను వెల్లడిస్తూ నానీల తీరాన అన్న పేరుతో ఆలోచనాత్మకమైన నానీల సంపుటిని ఎన్‌ ‌లహరి వెలువరించారు. ఇది కవయిత్రి  లహరి వెలువరించిన ద్వితీయ రచననే అయినా అద్వితీయంగా కుదిరిన నానీల మేలుకలయిక అని ఆశీరభినందనలో నానీల సృష్టికర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  డా ఎన్‌ ‌గోపి తెలిపారు. గత రెండు దశాబ్దాల నానీల ప్రయాణ కవిత్వ చరిత్రలో నదీ ప్రవాహంలా నిరంతరంగా నానీలు కొనసాగడానికి లహరి వంటి ఎందరెందరో  వెలువరించిన నానీల సంపుటులే నిదర్శనమని ప్రముఖకవి, విమర్శకులు డా ఎన్‌ ‌రఘు కవితాలహరి పేరుతో రాసిన ముందు మాటలో వివరించారు. ఏ కవికైనా జీవితానుభవం మంచి ఫలితాలను ఇస్తుందనడానికి  ఉదాహరణలుగా లహరి నానీలు ప్రకాశించాయి. లహరి రచించిన తొలి కవితా సంపుటి అక్షర నేత్రాలను సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారు ప్రచురించారు. తనను తాను ఆత్మావిష్కరణం చేసుకుంటూ మార్మిక స్పృహతో, ధ్వన్యాత్మక  వ్యక్తీకరణతో అనుభవపూర్వక స్థితి నుండి సరికొత్త  ఆలోచనలను సానబెట్టి నవ్యతతో అందించినవే ఈ నానీలు.

ఆలోచన/  విజ్ఞతకు పునాది/  ఆవేశం/  విజ్ఞానానికి  సమాధి అన్న నానీ మనిషి మార్పు దిశగా నడవమని సూచించింది. ఇంట్లో ప్రపంచం /  బావి లాంటిదే/  పుస్తక ప్రపంచం/  మహాసముద్రం అని తిరుగులేకుండా  పుస్తక ప్రాధాన్యతను అక్షరీకరించారు. అలాగే మరొక నానీలో వజ్రాలు నాకెందుకు/  మంచి అక్షరాలు కావాలి/  కావ్యాలు/  సృష్టించడానికి అని చెప్పారు. ఒంటరి తనం మరణ సదృశ్యమని అనుబంధాల ఆక్సీజన్‌ ఎం‌త అవసరమో గుర్తు చేశారు. అన్నీ/  ఉచితమే/  దురదృష్టం ఏమిటంటే/  కష్టం విలువ కనువ •రుగు అంటూ వర్తమాన స్థితికి అద్దంపట్టే విమర్శనాత్మక నానీని అందించారు. మార్పుకైనా, కూర్పుకైనా మూలమయ్యేది  కవి చేతిలోని ఆయుధమైన కలమేనన్న నిశ్చితమైన భావనను ఇంకో నానీలో వెల్లడించారు.

గుడిసెలో/  కొలువైన సరస్వతి/  లక్ష్మీకటాక్షం లేక/  బడి మానేసింది అని పేదరికాన్ని  హృదయద్రావకంగా నానీలో దృశ్యీకరించారు. చిరునవ్వు, కోపం మనిషి చేతిలోని రెండు ఆయుధాలని, ఏ ఆయుధం తీయాలన్న విచక్షణ అతని చేతిలో ఉందని తెలిపారు. విషాద కెరటాలు పోటెత్తినప్పుడు మధుర జ్ఞాపకాల ఒడ్డును చేరుకుంటానన్నారు. వెలిగే కొవ్వొత్తి నుండి పరులకు మేలు చేసే గుణాన్ని అలవర్చుకోమని సూచించారు. తరాలు మారినా  పేద ధనిక అంతరాలు మాసిపోలేదని వేదన చెందారు. మనసు నిండా దిగులుంటే ఇంటి నిండా పూల మొక్కలుండి ఏం లాభమన్న నిర్వేదాన్ని వ్యక్తపరిచారు. ప్రేమకు కొలమానమెక్కడిదని ప్రశ్నించారు. కరోనాతో  కాలుష్యం తగ్గినా  మనిషిలో మసకతనం మాసిపోలేదని బాధపడ్డారు.

సముద్రపు అల/  నాకు గురువే /  బ్రతుకు పాఠాలు/  ఎన్నో నేర్పింది అన్న నానీ మనిషి నడిచొచ్చిన జీవన గమనాన్ని స్పష్టంగా  పట్టి చూపింది. హృదయమున్న  మనిషికి స్నేహం  కన్నీళ్ళతోనే కుదురుతుందేమోనన్నారు. దోమలన్నీ అవినీతి  రక్తం తాగొద్దని తీర్మానించాయంటూ  రాసిన ఒక నానీ చురకనంటించింది. దేహశుద్ధికి సబ్బులు వాడితే ఆత్మశుద్ధి సంగతేంటని  ప్రశ్నించారు. వేసవిలో ఇంటికొచ్చిన కొత్తకుండను చల్లదనపు అతిథిని చేసి చూపారు. సంవత్సరాల తరబడి ఇంకా సాగుతున్న ముగింపు లేని  టీవీ సీరియళ్లను గురించి ప్రస్తావించారు. విలువల వృక్షానికి/  డబ్బుచెదలు/  శిధిలావస్థలో/  ఆధునిక లోకం  అన్న నానీ విమర్శనాత్మకమై మెరిసింది. కుండపోత వానల్లో పేదోడే బాధితుడన్నారు. నీడకోసం ఏడ్చే కన్నా చెట్లను పడగొట్టడం మానమని హితవు పలికారు. ఆమె ముఖంలోని అందమైన నవ్వును వెన్నెల  పువ్వుతో పోల్చి చూపారు. భయపడితే మరణమని అదే ఎదిరిస్తే అందరూ సాగిలపడి నువ్వే శరణమంటారని చెప్పారు. బాల్యంలోని క్వశ్చన్‌ ‌బ్యాంకే ఇప్పుడు గొప్ప  శాస్త్రవేత్త అయ్యాడన్నారు. తెలుగును తలపోస్తూ అంపశయ్యపై అమ్మభాష, పల్లకిలో పరాయి భాష అని వేదన చెందారు. పట్నంతో సహవాసంతో పల్లె పరిమళం తగ్గిందన్నారు.  పేదరికమే గొప్ప చిత్రకారిణి అన్న వినూత్న భావనతో రాసిన నానీ ఆలోచింపజేస్తుంది. తెగిన అనుబంధాల్ని అతికించగలిగే శక్తి  చిరునవ్వుకే ఉందని చెప్పారు. గాయాన్ని గురువుగా భావించారు. మనసు భాషను అర్థం చేసుకుని జీవనవీణపై  శృతితప్పని రాగమై  సాగడంలోని పరమార్థాన్ని  చూడమన్నారు. వలస జీవికి ఆకలి ఒక్కటే ఈ ప్రపంచంలో ఆత్మీయ నేస్తమని చెప్పారు.

అమాంతంగా ఆకాశానికి ఎగసిన  ధరై వార్తల్లో ఎంతో వింతైన టమాటోపై  రాసిన నానీలో టమాటో నేడు/   చుక్కల్లో వేగుచుక్క/  రేపటికి/  అనాథలా రోడ్డు పక్క అన్నారు. ఊరికెళితే మైదానం పిలిచి తనతో ఆడుకొమ్మందంటూ బాల్యపు సమీరాన్ని  స్పృశించారు. కవితాత్మ హృదయంలోంచి రావాలంటూ ముఖపుస్తకంలో లైకులు, కామెంట్లు కాదని అన్నారు. అసలైన ముఖ చిత్రం ఏమిటో కమ్ముకున్న ముసుగును తొలగించి చూడమన్నారు. గొడవ తరువాత అలుముకునే నిశ్శబ్దమే ఎంతో  భయంకరమని తెలిపారు. వర్షంలోని మట్టి వాసనకు ఏదీ  సాటిరాదని చెప్పారు. తినక కూడబెడితే తినాలన్నప్పుడు అరగదని అన్నారు. ఒంటరితనం చాలా బరువని, ఓడిపోవడమే  గెలుపుకు తొలిమెట్టని చెప్పారు. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే నిరంతరం మనిషి యుద్ధం చేయాల్సిందేనన్నారు.

పచ్చిపులుసు ముద్దయిన్నా పరమాన్నమేనని  ఆనందపడ్డారు. రైతు బ్రతుకు  పచ్చరంగును వదిలి నలుపెక్కుతుందని బాధపడ్డారు. మోసంతో  మనసు వికలమైన కవికి తన స్వీయ రాతలే గొప్ప ఓదార్పుల స్వాంతనలని వెల్లడించారు. కొండలన్నీ తవ్వినా  రాజకీయ ఎలుక దొరకలేదని ఘాటుగా అనేశారు. భవిష్యత్తుకు దీపదారి చరిత్రేనని అన్నారు. కాలానుగుణ మార్పులను స్వాగతించమన్న  భావనను పలు నానీలలో సందర్భానుసారంగా  వ్యక్తపరిచారు. కట్టెలేవయినా/  కాలేది కట్టే అని మనిషికి చివరికి మిగిలేది ఏమిటో అక్షరాలా తేల్చి చెప్పారు. పుస్తకాన్ని దారి చూపే టార్చ్లైట్తో పోల్చారు. ఊరంటే జ్ఞాపకాల  పరిమళమని చెప్పారు. స్వార్థంతో బందీలైన  మనుషుల కన్నా పంజరంలోని చిలుకకే  స్వేచ్ఛ  ఎక్కువ అని తెలిపారు. మాటల కోయిలకు /  మౌనంతో మైత్రి వంటి వాక్యాలు ఎంతో  ప్రత్యేకంగా నానీలలో  కన్పిస్తాయి.

ఎగిసిపడితే కిందపడక తప్పదన్న సంగతిని గుర్తుచేస్తూ మనిషి సమస్యలతోనే సాగమన్నారు. భావనలను ఉప్పొంగే అలలతో పోల్చారు. ఉన్నతమైన/  ఆశయం ముందు/  హిమాలయం/  చిన్నబోయిందని చెప్పారు. అనుబంధాలు అందుకునేంత ఎత్తులోనే  ఉండాలని భావించారు. తనలోకి తాను చూసుకోని ఏకాకి మనిషే అని వెల్లడించారు. కష్టాల మేఘాలు రైతును కమ్మాయన్నారు. నేటి సినిమాలో జీవితం లేదని చెప్పారు. అంతర్జాలంలో  అన్నీ అమ్మకానికేనని తెలిపారు. బతుకు బండికి ఇంధనం అనుబంధమేనని స్పష్టపరిచారు. నిర్లక్ష్యం ఫలితం రహదారికి రక్త తిలకమని వేదన చెందారు. నిరంతర అధ్యయన శీలతే,  నానీల  నాన్న  స్థాయికి చేరుస్తుందని తెలిపారు. వస్తువైవిధ్యంతో, అభివ్యక్తి వైచిత్రితో, భవిష్యత్తుకు వాగ్దానాలుగా ఈ నానీలు నిలుస్తాయి.
– డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *