- కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు
- బీజేపీ, బీఆరెస్ కుట్రలను ప్రతీ తెలంగాణ బిడ్డ తిప్పికొట్టాలి
- అక్బరుద్దీన్, అసదుద్దీన్..మీరు ఎవరివైపో తేల్చుకోండి
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగబోతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పట్టిన చీడ నుంచి తెలంగాణకు విముక్తి లభించనుందన్నారు. సోమవారం తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నార్డు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని, విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని, నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతుందని, రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే స్థాయి లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బిల్లా రంగాలకు సూటిగా సవాల్ విసురుతున్నానని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు తాను సిద్ధమని, 2014 నుంచి 2023 వరకు బీఆరెస్ పాలనలో వారు ఏం చేశారో చర్చకు రావాలని, తేదీ చెప్పండని, అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాము సిద్ధమని కేటీఆర్, హరీష్ రావులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని, పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ చలి జ్వరం వొచ్చిందని, కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వొచ్చిందని, ఇక ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని, వొచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని రేవంత్ అన్నారు. డిసెంబర్లో అద్భుతం జరగబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్ప… ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి మహిళలను ఆదుకుంటామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15వేలు అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సంపద పెంచాలి…పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమన్నారు రేవంత్ రెడ్డి. తాము బీజేపీ, బీఆరెస్ పై విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు రేవంత్ రెడ్డి. వారు ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. 2018లోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే చేసి, 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ముందుకు వొచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.





