- రైతుబంధును కాపీ కొట్టింది ఎవరు
- కెసిఆర్ రైతు వ్యతిరేకి అనడం జోక్
- మిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ మండిపాటు
- దేశాభివృద్ధికి త్రీ ఐలు లక్ష్యం కావాలి
- త్రీ డీల వల్ల నాశనం తప్పదన్న కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : అమిత్‌షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరిట ప్రవేశపెట్టారంటూ ఆయన ట్వీట్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత..దేశ రైతాంగం తీవ్ర వ్యతిరేకత వల్ల క్షమాపణ చెప్పిన వారెవరని ప్రశ్నించారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా మునుగోడు సభలో చేసిన వ్యాఖాలను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అన్న షాపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో చేరలేదని కేసీఆర్‌ను విమర్శిస్తున్న అమిత్‌షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని ప్రశ్నించారు.
ఆ పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఆ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ది చేకూరుస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా…అర్థరహితమైన కపట నాటకాలు వదిలిపెట్టాలని అమిత్‌షాకు కేటీఆర్ సూచించారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే మూడు ‘ఐ’లు కావాలన్నారు. మూడు ‘డీ’ల వల్ల ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ విఫలమవుతుందని మండిపడ్డారు. కలిసికట్టుగా కృషి చేస్తే..సరికొత్త ఆవిష్కరణలు( ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు(ఇన్ ఫాస్ట్రక్చర్), సమ్మిళిత వృద్ధి(ఇంక్లూసివ్ గ్రోత్)ని దేశం సాధిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన వాదం(డివిజన్), ఎగతాళి (డెరిషన్), వాగ్దాటి (డెమగోగెరీ)పై అత్యున్నత నాయకత్వం దృష్టిపెడితే..
దేశం విఫలమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్లే మన దేశ జీడీపీ విలువ పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘1987 సంవత్సరం నాటికి చైనా, భారత్‌ల జీడీపీ విలువ దాదాపు సరి సమాన స్థాయిలో.. చెరో 470 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 సంవత్సరం వొచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది చైనా జీడీపీ విలువ 16 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత జీడీపీ విలువ 3.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే’ అని కేటీఆర్ పేర్కొన్నారు. జీడీపీ విలువల గణాంకాలతో నాయిని అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి షేర్ చేసిన పోస్ట్‌ను .. కేటీఆర్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.




