నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్ కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్ వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే నేడు యధేచ్చగా అమలవుతుంది.వారు విశ్వసించిన ప్రజా సంఘాలనే పనిగట్టుకుని పతనం చేస్తున్నారు.కావునా ఇది ఏమాత్రం జయశంకర్ ఆశించిన తెలంగాణ కాదు.ఇది సీమాంధ్ర దోపిడి పాలనకంటే రెట్టింపు లో కొనసాగుతున్న నిరంకుశమైన పాలనే..
ఆరు దశాబ్దాల ఉద్యమానికి సజీవ సాక్షిగా ఉండి,అంతులేని ఆవేదనలు అనుభవించిన ఆచార్యులు అస్తమించి అప్పుడే పండేండ్లు. పన్నెండేళ్లు
ఐంది.తెలంగాణ పోరాట ఘట్టంలో జైశంకర్ ,జయశంకర్ ,జై తెలంగాణ, నిరంతరం వినబడే నినాదాలు.అతని పేరే ఒక నినాదం,తెలంగాణ రూప కర్త తనే..అతను లేని లోటు తెలంగాణ లో పూడ్చలేనిది..తెలంగాణ అనే మట్టిని ముద్దలు,ముద్దలుగా చేసి ఆ ఆశయానికి ప్రాణం పోసి కాలువలు గా పాయలైన వివిధ భావ సారూప్యత గల సంస్థలను ‘‘తెలంగాణ రణ నినాదం’’ అనే మైదానంలో కి మళ్లించి జనసముద్రం చేసినవారు ఆచార్య జయశర్…నమ్మిన సిద్దాంతం కోసం తను నడిచే తొవ్వలో ఆటుపోటులు ఎదురైనా,ఒంటరైనా, సర్వజనుల సంక్షేమాన్ని మరువని ఒక మార్గ నిర్దేశకుడు.అతను నడిచిన నేలంతా ఉద్యమాల తంగెళ్ళ వనమే..ఒంటరిగానే తెలంగాణ సాధన కోసం ఆలోచన పోరాటం ప్రారంబించాడు..వనపట్ల సుబ్బయ్య మాటల్లో కొట్టం మీద తొలి కోడై ఊర్లకు ఊర్లను నిద్రలేపి ‘‘తెలంగాణ నే చందమామ అని’’ మెల్ల మెల్లగా క్లాసు లో మొదలు పెట్టి అడుగడుగునా అన్యాయాన్ని నిలదీస్తూ తండ్లాట మా హక్కు అని తెలియజెప్పిన మహానుభావుడు జయశంకర్.. పోరు గడ్డ పై అతని పిలుపు ఒక చైతన్యం.
పిడికెడు మాటల ని తెలంగాణ సమాజం లో విత్తనాలు గా చల్లి ఉద్యమంగా మలిచారు..ఇవి మొలకెత్తి ఏదో ఒక రోజు ఉద్యమంలో వచ్చే అగాధాల ని పూడ్చి వేయగలవని బలంగా నమ్మారు.. ఈ సమైక్యాంధ్ర కొండలను పిండి చేయగలమని..ఈ ఎగుడు దిగుడులను నీళ్ళు, నిధులు,నియామకాలు అనే అంతర్ సూత్రీకరణ ద్వారా సమతులం చేయగలమని భావించే వారు..కళ్ళేదురుగా ఉన్న నిరాశ పర్వతం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక ‘‘ఆశా శిలను’’ చెక్కుకోవాల్సి ఉన్నదనే నమ్మకం తోనే ఉద్యమంలో ఉన్న రణధ్వనులను ఒక చక్కని స్వరం గా మలిచారు ఆచార్యుడు..
మనం కలిసి పనిచేయగలుగుతాం…
కలిసి ఉద్యమించగలుగుతాం…
కలిసి ఆధిపత్య శక్తులను నిలువరించగలుగుతాం..
అన్యాయాన్ని ఎదురించగలుగుతాం..
ఏదో ఒక రోజు మన రాష్ట్రం సాధించుకోగలుగుతాం అన్న జయశంకర్ మాటలను నేడు తెలంగాణ లో నెలకొన్న స్థితిగతులను బట్టి పునరావృతం చేయాల్సిన అవసరం ఉన్నది.
నాకొక స్వప్నం ఉందని నా తెలంగాణ రైతన్నల పొలాలు క్రిష్ణా, గోదావరి జలాలతో తడిసి ముద్దయ్యే రోజులు రావాలని,నా తెలంగాణ ప్రజలు ఫ్లోరిన్ భూతం నుండి విముక్తి కావాలని.. నా సింగరేణి ప్రజలు బొందల గడ్డ కాకుండా సిరులు పంచే రోజు రావాలని.. గద్దలా తన్నుకుపోతున్న ఉద్యోగాలను దక్కించుకోవాలని కలలు కన్నారు.. ఆ ఆకాంక్షల సాధన కై సకల జనులను ఏకం చేసి తెలంగాణ ను సాధించడంలో ఉద్యమ సూర్యుడు జయశంకర్ పోషించిన పాత్ర వెలకట్టలేనిది.
వారు ఆశించిన తెలంగాణకు,నేడు నడుస్తున్న పాలనకు ఏమాత్రం సరిపోలదు.నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్ కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్ వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే నేడు యధేచ్చగా అమలవుతుంది.వారు విశ్వసించిన ప్రజా సంఘాలనే పనిగట్టుకుని పతనం చేస్తున్నారు.కావునా ఇది ఏమాత్రం జయశంకర్ ఆశించిన తెలంగాణ కాదు.ఇది సీమాంధ్ర దోపిడి పాలనకంటే రెట్టింపు లో కొనసాగుతున్న నిరంకుశమైన పాలనే..
స్వేఛ్ఛ,సమానత్వం కొరకు లక్షలాది నల్ల జాతీయులు వాషింగ్టన్ లో సమావేశమై ఒక మార్చ్ నిర్వహించి ఆనాడు వచ్చిన అశేష జనావాహిని ఉద్దేశించి నల్ల జాతి సూరీడు మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశారు.ఆనాడు ఆయన అన్న మాటలు ఇవాళ తెలంగాణ పరిస్థితి కి సరిగ్గా సరిపోతాయి.రాజ్యాంగ నిర్మాతలు తమ పౌరులందరికీ ఇచ్చిన సమాన హక్కులను నల్ల జాతీయులకు అందించడంలో అమెరికా విఫలమయిందని హక్కుల హామీ పత్రం ఒక చెల్లని చెక్కు అయిందని ఆనాడు మార్టిన్ లూధర్ కింగ్ అన్నారు.
ఇవ్వాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అంటున్నారు..ఆనాడు బాసలు చేసి తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని ఉద్యమ పార్టీ గా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనతికాలంలోనే ఇచ్చిన హమీలను,అడిగిన సంఘాలను అణచివేస్తూ అంతులేని నిర్బంధకాండను కొనసాగిస్తుంది..హైదరాబాద్ నుండి బొడ్డున ఉన్న గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించే స్వేచ్చ తెలంగాణ పౌరులకు లేకుండా చేస్తుంది.ఉస్మానియా,కాకతీయ తదితర విశ్వవిద్యాలయాలలో సభలు జరుపుకుందామంటే పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు..ఈ ప్రాంతంలో ప్రజాస్వామికబద్దంగా ఏదైనా సమావేశం పెట్టుకుందామంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు..ఎటు చూసినా ఫాసిస్టు పాలన కొనసాగుతుంది..అలాంటి పాలనకు ఉద్యమాల గడ్డ పై తావు లేదని చెప్పాల్సిన సందర్భం ఆసన్నమైంది.ఉద్యమం చేసి అలసిపోయి చల్ల బడ్డారని.. సమస్య ఏమీ లేదని యధాతథ స్థితి ని కొనసాగించే ప్రయత్నం చేస్తే అది పొరపాటవుతుంది.తాయిలాలకు లొంగిపోయే నాయకులు ఉండొచ్చు, భజన కీర్తనలు పాడేవారు ఉండవచ్చు… కాని కనివిని ఎరుగని రీతిలో మహత్తరమైన ప్రజా ఉద్యమాన్ని నడిపిన ఆచార్య జయశంకర్ ఆలోచనలను ఆచరించిన విద్యావంతులు,బుద్ది జీవులు,పౌర సమాజం జయశంకర్ ను స్మరించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కై ప్రతినబూనుతూ..వారి స్ఫూర్తి ని నిలబెట్టాల్సిన అవశ్యకత సకల జనుల పై ఉన్నదని తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా విశ్వసిస్తుంది.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




