నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని
మృగాలుగా మార్చింది ఎవ్వడు ?
పాలిచ్చిన అమ్మల రొమ్ములను
బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి
ఊతమిచ్చింది ఎవ్వడు ?

వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ?
విద్వేషాన్ని రక్త నాళాలలోకి
ఎక్కించింది ఎవ్వడు?
తల్లుల జననాంగాల మీద తాండవమాడిన
గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ?

నెత్తురుని మరిగించింది ఎవ్వడు ?
కత్తులను నూరించింది ఎవ్వడు ?
పరమత ఆలయాలను కూల్చింది ఎవ్వడు?
ఉసురు తీసి ఉత్సవం చేసింది ఎవ్వడు ?

మంటలను రాజేసింది ఎవ్వడు ?
గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు ?
మదమెక్కి ఆడ బిడ్డలపై మానభంగం చేసిన
మతోన్మాద మూకలకు నూకలు
ఇస్తున్నది ఎవ్వడు?
పాకలు వేసి ‘‘భక్షణ శిక్షణ’’
అందిస్తున్నది ఎవ్వడు ?

ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది ?
ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది ?
మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది ?

పచ్చని గసగసాల పైరు కొండల
మణిపూర్‌ ‌కన్నుల కుండల నిండా
మరిగే వెచ్చిని నీరును నింపుతున్నది ?
వాడు….! వాడెవడంటే….!!

ఛాందస పీఠంపై పీటలు వేసుకొని
మౌఢ్య సిరా చుక్కలను
మౌన కలంలోకి ఒంపుకొని
రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.
మన జీవన గమనాలను శాసిస్తున్నాడు.

అయితే….. !
ఇప్పుడు వాడు అనుకుంటున్నట్టు …!!

మణిపూర్‌ ‌నడి వీధుల్లో
నగ్నంగా నడిచింది దేహం కాదు
……… ‘‘అది దేశం’’.

పాశవిక అత్యాచారం జరిగింది
మానం మీద కాదు
……. ‘‘వాడి మౌనం మీద’’
           – బండారు రమేష్‌, ‌ఖమ్మం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *